సాక్షి, గుంటూరు: పల్నాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నాగారాజును కిడ్నాప్ చేశారని.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.
‘‘మాచర్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతో వినుకొండ వచ్చారు. పోలీసు వ్యవస్థ పని చేస్తోందా?. ఎస్పీతో కూడా మాట్లాడాం. నాగరాజుకు ఏ విధమైన హాని జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలి. బెయిల్ మీద బయట వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులను కొట్టి టీడీపీ గూండాలు కిడ్నాప్‌కి దిగారు. నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా?’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
‘‘రాష్ట్రాన్ని మణిపూర్, బీహార్‌లాగా మార్చారు. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు వారిని ఏమీ అనటానికి వీల్లేదని హోంమంత్రి నుండే ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. పోలీసులు వెంటనే స్పందించి నాగరాజును కాపాడాలి’’ అని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment