
సాక్షి, కాకినాడ: ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్య పడొద్దు, ధైర్యంగా ఉండాలి. టీడీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలను అందరం కలిసి ఎదుర్కొందాం. కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. చిత్తూరు జిల్లాలో పుంగనూరులో పచ్చ నేతలు రెచ్చిపోయారు. కమ్మపల్లిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు సుబ్రమణ్యరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు గ్రామం నుంచి వెలివేశారు. ఆయన పండించుకున్న టమాటా పంటను అమ్ముకోకుండా అడ్డుకున్నారు. దీంతో టమాటాలన్నీ కుళ్లిపోయి భారీ నష్టం వాటిల్లింది. కనీసం ఆవులకు మేత వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టిస్తున్నారు. ఇక, పోలీసులకు చెబితే గ్రామం వదిలి వెళ్లిపోవాలంటున్నారని సుబ్రమణ్యరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
