సాక్షి, రాజన్న సిరిసిల్ల: తనకు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల అని చెప్పుకొచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. అలాగే, రాముడు అందరి వాడు.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నాం. సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుకున్నాం. మీరు నన్ను ఇక్కడ గెలిపించినా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి విజయం సాధించింది. మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో గెలిచింది.
ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి?. అబద్ధాలు చెబితే డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషంలో దొరికిపోతారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నామో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకుని కాంగ్రెస్ నాయకులు అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాక ఒక లెక్క అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు. కేసీఆర్ మళ్లీ కావాలనుకుంటే మే 13వ తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించండి.. తెలంగాణలో శాసించే అధికారం వస్తుంది.
బీజేపీ నేతలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. రాముడు అందరివాడు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దేవాలయాలు బీజేపీ పుట్టకముందు నుంచే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నులు వేసి మోదీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మళ్లీ అబ్కీ బార్ 420 అంటున్నాడు. అక్కరకురాని చుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకో జోడీ దారు దొరికితే.. రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment