సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లాలో నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డి పేట మండలం గుంటపల్లి చెరువుతండాలో మంత్రి కాన్వాయ్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నియోజకవర్గంలో పర్యటించేందుకువచ్చిన కేటీఆర్ వాహనాన్ని కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదే విధంగా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. కాగా రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అనేకచోట్ల చేతికొచ్చిన పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి ఆరా తీశారు. రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని, కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు.
చదవండి: సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళిసై గైర్హాజరు.. రాజ్‌భవన్ క్లారిటీ..
Comments
Please login to add a commentAdd a comment