సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ తప్పిదం వల్లే విజయవాడ మునిగిందని ఆరోపించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందన్నారు. మీడియా పబ్లిసిటీకి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు.
కాగా, కురసాల కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడను ముఖ్యమంత్రి చంద్రబాబు ముంచేశారు. చంద్రబాబు పాలనలో డొల్లతనం బయటపడింది. బాధితులను ఆదుకున్నామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా?. చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంట్ చేసుకుంటున్నారు. కేవలం పబ్లిసిటీ మాత్రమే చేసుకుంటున్నారు. వర్ష ప్రభావాలపై ముఖ్యమంత్రి ఒక సమీక్ష అయినా చేశారా?. వర్షాలు, వరదల గురించి సీఎంఓ ఎందుకు ఆరా తీయలేదు.
పునరావాస కేంద్రాలు ఎక్కడ?
సుమారు 20 జిల్లాల్లో వరద ప్రభావం ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తుతామని డీఈ ముందే సమాచారం ఇచ్చారు. ప్రభుత్వానికి తెలిసే ప్రజల్ని గాలికి వదిలేశారు. 45 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి సిగ్గు అనిపించలేదా?. బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చినా పట్టించుకోలేదు. పునరావాస కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. విపత్తు నిర్వహణపై అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సింది పోయి.. మీడియా పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భారీగా వరదలు వచ్చినా ప్రాణ నష్టం జరగలేదు.
సమీక్ష ఏది బాబూ..?
ఎనిమిది రోజులు ఐనా ఇంతవరకు పరిస్థితి సద్దుమనగలేదు. రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇది చంద్రబాబు ఫెయిల్యూర్ స్టోరీ. 20 గంటల ముందే వెలగలేరు గేట్లు ఎత్తుతామని చెప్పినట్టు చెప్పారు. మేము అలర్ట్‌గా లేమని కలెక్టర్ చెప్పారు. సిసోడియా అయితే ఏకంగా జనాన్ని తరలించటం సాధ్యం కాదని చెప్పేశారు. సినీనటి గురించి చంద్రబాబు ఆరా తీశారే గానీ, వరదలను గాలికి వదిలేశారు. కొండ చరియలు విరిగి పడి ఆరుగురు చనిపోతే చంద్రబాబు అక్కడకు ఎందుకు వెళ్లలేదు?. ఈ ఘటనలన్నిటినీ సీఎం చాలా తేలిగ్గా తీసుకున్నారు. వరదలు వస్తున్నప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులలో ఫ్లడ్ కుషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు?.
2014-19 మధ్య బుడమేరును చంద్రబాబు ఎందుకు ఆధునీకరణ చేయలేదు?. మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా?. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు బుడమేరు గురించి తెలియదా?. నిత్యవసర వస్తువులను 2.35 లక్షలకు ఇవ్వాలనుకుని ఎంతమందికి ఇచ్చారు?. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కనీసం 25% మందికి కూడా నిత్యవసరాలు పంపిణీ చేయలేదు. బ్యారేజీ వద్ద బోట్లను వైఎస్సార్‌సీపీ వాళ్లే అడ్డు పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎనిమిది రోజులు చంద్రబాబు సెక్రటేరియట్‌కు వెళ్లి ఎందుకు సమీక్ష నిర్వహించలేదు?. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 5.04 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు లెక్కలు వేశారు. అంటే రెండు లక్షలకు పైగా రైతులు నష్టపోతే సమీక్ష ఎందుకు చేయలేదు?. కరకట్ట మీదకు జనాన్ని ఎందుకు వెళ్లనీయటం లేదు?. ఎవర్నీ ఫోటోలు కూడా ఎందుకు తీయనీయటం లేదు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సిబ్బందికి కనీసం భోజనాలు కూడా ఏర్పాటు చేయటం లేదు.
వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల్లోనే..
గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులను టార్గెట్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్ కట్టించిన రక్షణ గోడ కృష్ణలంకను కాపాడింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎండీయూ వాహనాలను చంద్రబాబు కూడా వాడుకోక తప్పట్లేదు. కరోనా లాంటి అతిపెద్ద సమస్యలను కూడా వైఎస్ జగన్ వీరి ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. వరద రాజకీయాలు, బురద రాజకీయాలు చేయటం వైఎస్సార్‌సీపీ విధానం కాదు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుంది. బుడమేరుకు ఇప్పటికి మూడుసార్లు వరద వచ్చింది. ఆ మూడుసార్లు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. మరి ఆయన శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేదు?. చంద్రబాబు నిర్లక్ష్యం వలనే బుడమేరు వలన నష్టం కలిగింది. 1960లోనే బుడమేరుకు వెలగలేరు దగ్గర గేట్లు పెట్టారు. కానీ అసలు గేట్లే లేవని చంద్రబాబు అనటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment