సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబమని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌లో శనివారం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూ అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కాములు నడుస్తున్నాయన్నారు. ధరణి కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద స్కామ్, ఇక తెలంగాణ బడ్జెట్ మహా స్కామ్ అని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతూ అందులో రూ.ఒక లక్ష కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.23,600 కోట్లు బడ్జెట్‌లో పెట్టి అందులో కేవలం రూ.380 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం నిదర్శనమని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం లిక్విడ్ డైట్ (మద్యం అమ్మకాలు, చమురుపై పన్నులు)తో నడుస్తోందన్నారు. ఇక పోలీసు శాఖను చలాన్ల శాఖగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతూ స్కాములు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం, మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment