Konda Visvesvar Reddy
-
కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ ఓ పెద్ద స్కామ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబమని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌లో శనివారం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూ అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కాములు నడుస్తున్నాయన్నారు. ధరణి కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద స్కామ్, ఇక తెలంగాణ బడ్జెట్ మహా స్కామ్ అని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతూ అందులో రూ.ఒక లక్ష కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.23,600 కోట్లు బడ్జెట్లో పెట్టి అందులో కేవలం రూ.380 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం నిదర్శనమని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం లిక్విడ్ డైట్ (మద్యం అమ్మకాలు, చమురుపై పన్నులు)తో నడుస్తోందన్నారు. ఇక పోలీసు శాఖను చలాన్ల శాఖగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతూ స్కాములు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం, మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
చేవెళ్ల ఎంపీ కొండా అరెస్ట్..విడుదల
హైదరాబాద్: తన ఇంటికి నోటీసు ఇవ్వడానికి వచ్చిన గచ్చిబౌలి ఎస్ఐ కృష్ణ, కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు ఆయన కార్యాలయంలో ఉద్యోగి చంద్రప్రకాశ్, ఆయన పీఏ వై.హరిప్రసాద్‌లకు బంజారాహిల్స్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి బెయిల్ మంజూరు చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొండా అనుచరుడు సందీప్‌రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంపిణీ చేస్తుండగా గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. సందీప్‌పై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 16న ఎస్ఐ కృష్ణ, కానిస్టేబుల్‌తో కలిసి బంజారాహిల్స్‌లోని కొండా నివాస కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఎస్ఐ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29న నాంపల్లి రెండవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ముందస్తు తీర్పునిస్తూ కొండాతోపాటు చంద్రప్రకాశ్, హరి ప్రసాద్‌లను అరెస్ట్ చేసే ముందు వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని బెయిలివ్వాలని ఆదేశించారు. దీంతో రూ.25 వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించిన విశ్వేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఆయన ఉద్యోగులను కూడా రూ.5 వేల చొప్పున పూచికత్తులు తీసుకొని విడుదల చేశారు. -
హైకోర్టుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోలీసులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారంటూ నమోదైన కేసులో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులే తనపట్ల దురుసుగా వ్యవహరించారని, దీనిపై తానే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిటిషన్లో ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసిన తరువాత అందుకు ప్రతీకారంగా గచ్చిబౌలి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, ఈ ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేశారన్నారు. తన కాలర్ పట్టుకొని దుర్భాషలాడిన పోలీసుపై మాత్రం కేసు నమోదు చేయని పోలీసులు... అతనిపై ఫిర్యాదు చేసినందుకు తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేసు వెనుక రాజకీయ కారణాలు... కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందునే పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చానన్న కారణంతో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తనను ఇలా తప్పుడు కేసులో ఇరికించారని, సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్న తనకు చట్ట విరుద్ధమైన పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో సందీప్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద దొరికిన రూ. 10 లక్షలతో తనకు ఎటువంటి సంబంధం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫిర్యాదుదారైన పోలీసును తాను కొట్టలేదని/నిర్బంధించలేదని, ఎంపీగా ఉన్న తాను ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదన్నారు. అందువల్ల తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ మంజూరు చేసేలా ఆదేశా లివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ ముందు శుక్రవారం విచారణకు రాగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు బంధువని, అందువల్ల ఈ వ్యాజ్యంపై తాను విచారణ జరపడం భావ్యం కాదంటూ జస్టిస్ సంజయ్ తప్పుకున్నారు. ఈ కేసును మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
మన గడ్డపై ‘చైనీస్ కాలె’
చేవెళ్ల: విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న సీడ్‌తో చేవెళ్లలో చైనీస్ కాలె ఆకుకూర పంటను సాగు చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన పాలీహౌస్లో ఈ పంటను పండిస్తున్నారు. అత్యంత పోషక విలువలున్న ఈ పంటను సుమారు 500 నుంచి 600 గజాల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. పాలీహౌస్లో ఆరు బెడ్లలో (వరుస) సాగుచేస్తున్నారు. మొదటగా కొన్ని రోజుల క్రితం కొన్ని మొలకలను ఆరుబయట నాటిన ఈ పంటను ప్రస్తుతం పాలీహౌస్లో పండిస్తున్నారు. ఈ పంట సాగు విధానం, వండే పద్ధతి, వాటిలో ఉండే పోషక విలువలు పాలీహౌస్ పర్యవేక్షకులు మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలు తెలియజేశారు. పంట సాగు పద్ధతి ఇలా.. ఈ పంటను చైనీస్ కాలె (కైలాన్) అని పిలుసా ్తరు. దీని శాస్త్రీయ నామం ఁబ్రాసికా ఒలెరేసియో ఆల్చోగ్లాబ్ఙ్రా. ముఖ్యంగా చైనా దేశం నుంచి విత్తనాలను తీసుకువచ్చి సాగు చేస్తారు. అమెరికా తదితర దేశాలలో కూడా ఈ పంటను పండిస్తారు. సాగు విధానమేమిటంటే... చైనీస్ కాలెవిత్తనం ఆవాల వలే చిన్నగా ఉంటాయి. వీటిని నర్సరీ ట్రేలలో పోసి నారును పెంచుతారు. 20 రోజుల వ్యవధిలో విత్తనం నారుదశకు మారుతుంది. ఈ నారును టమాటా నారు నాటినట్లుగానే పొలంలో నాటుతారు. మొక్క నాటిన 40 నుంచి 60 రోజులలోపు పంట చేతికి వస్తుంది. ఆ సమయం నుంచి పంటను తీసుకోవచ్చు. వండే విధానం.. చైనీస్ కాలె పంట ఆకుకూరవలే కాస్తుంది. ఇది దాదాపు పాలకూరను పోలి ఉంటుంది. భూమిలో నుంచి కాండం వచ్చి పైన ఆకులు కాస్తాయి. ఈ కాండాన్ని వండుకొని మునగ కాయలవలె భోజనంతో పాటు తీసుకోవచ్చు. వండే విధానం ఎలాగంటే.. ఈ పంటను కాండంతో పాటుగా మొదటికి కోస్తారు. కోసిన తర్వాత కాండాన్ని, ఆకులను వేరు చేస్తారు. కాండాన్ని నాలుగు ముక్కలుగా కోయాలి. మొదట నీటిలో ఉప్పువేసి ఉడకబెడతారు. ఉడికేటప్పుడు డార్క్ సోయాసెస్ వేస్తే పొంగుతుంది. అప్పుడు దానిని బయటకు తీసి నీటిని పారబోసి చల్లార్చాలి. తర్వాత వంట పాత్రలో ఆలివ్ ఆయిల్‌వేసి చైనీస్ కాలె కాండం ముక్కలు వేయాలి. వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. నాలుగు స్పూన్ల చక్కరవేసి ఉడకబెట్టాలి. 7 నుంచి 8 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత పొయ్యిమీద నుంచి తీస్తే వంట పూర్తవుతుంది. కాండంనుంచి వేరుచేసిన ఆకులను కూడా వండుకోవచ్చు. విటమిన్లు ఎన్నో... చైనీస్ గైలాన్ అని కూడా పిలిచే ఈ వంటకంలో అనేక పోషక పదార్థాలున్నాయి. దీనిలో విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉన్నాయి. ఈ వంటకం తిన్నవారికి శరీర పైభాగాన ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి.