ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. అయా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తాజా అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.
‘కెప్టెన్’ ఆరోపణలను ఖండించిన అల్కా
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మంత్రి పదవి కోసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాబీయింగ్ చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఖండించారు. ‘కెప్టెన్’ తన మిత్రపక్షమైన బీజేపీ మాటలు వల్లెవేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
27న పంజాబ్‌కు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. 117 మంది పార్టీ అభ్యర్థులతో కలిసి స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని చెప్పారు. తర్వాత వర్చువల్ ర్యాలీని నిర్వహిస్తారని చెప్పారు.
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనను పార్టీ కండువాతో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ స్వాగతించారు. 32 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టారని ఈ సందర్భంగా ఆర్‌పీఎన్ సింగ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభమైందని, ప్రధాని మోది ఆశయ సాధనకు కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ హామీ
ఉత్తరాఖండ్‌లో తాము అధికారంలోని వస్తే ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.500 కంటే తక్కువకు పరిమితం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు. తాము పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.
2న ఆగ్రాలో మాయావతి సభ
బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 2న ఆగ్రాలో జరిగే బహిరంగ సభలో మాయావతి ప్రసంగిస్తారని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా తెలిపారు.
అప్నా దళ్ స్టార్ కాంపెయినర్లు వీరే
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి, రెండవ దశ ఎన్నికల స్టార్ ప్రచారకుల జాబితాను అప్నా దళ్ (సోనీలాల్) పార్టీ విడుదల చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్.. ఆమె భర్త, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిష్ పటేల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
జేడీ(యూ) తొలి జాబితా ఇదే
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 20 మంది అభ్యర్థుల పేర్లతో జనతాదల్ యునైటెడ్ పార్టీ మొదటి జాబితాను మంగళవారం విడుదల చేసింది.
‘ఆప్’ నాలుగో జాబితా విడుదల
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment