సాక్షి, యాదాద్రి: పీఆర్‌టీయూ సభ్యుల కోరిక మేరకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు. పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, తాను వరంగల్, జనగామ ధర్నాల్లో పాల్గొని యాదాద్రి భువనగిరి ధర్నాకు హాజరయ్యానని రవీందర్ అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు.
మనకు టీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్యం కాదని, పీఆర్‌టీయూ ముఖ్యమన్నారు. పీఆర్‌టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. అంతకుముందు భువనగిరి పట్టణంలో ప్రధాన రహదారిలోఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మోటె సత్తయ్య, గౌరవ అధ్యక్షుడు జాలిగామరామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ముత్యంరాములు, వివిధ మండలాల నుంచి జిల్లా అధ్యక్షులు, కార్యరద్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment