సాక్షి, హైదరాబాద్: దేశ ఉత్తర సరిహద్దులోని భూభాగాన్ని చైనా దురాక్రమణ చేస్తోందని, దీన్ని ఆపడానికి భారత్ చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 2020లో జూన్ 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిన మాటలే చైనా దురాక్రమణకు కారణమవుతున్నాయని ఆరోపించారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో జైరాం రమేశ్, పవన్‌ఖేరాలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, భద్రతా వైఫల్యం గురించి సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. దేశంలో రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి సవాల్ ఏర్పడిందని, ఓ పద్ధతి ప్రకారం వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు.
అంశాల వారీగా చిదంబరం ఏం చెప్పారంటే..
♦ దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోంది. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ... ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వట్లేదు. ఉదాహరణకు కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని అమలు చేయడంలో భాగంగా డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఎఫ్‌సీఐ బియ్యం ఇవ్వడం లేదు. బియ్యం ఇవ్వొద్దని పైనుంచి ఆదేశాలిచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా తీవ్ర నష్టం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, విపత్తు సహాయం కింద కూడా కేంద్రం ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు. దీనికి కారణం అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే.
♦ మే 5 నుంచి మణిపూర్ తగలబడుతోంది. అప్పటి నుంచి దాదాపు 157 రోజులుగా ప్రధాన మంత్రి చాలాసార్లు చాలా దేశాలకు వెళ్లివచ్చారు. ఏషియా సమిట్, జీ8 దేశాల సమావేశాలకు హాజరయ్యారు. కానీ, ఢిల్లీ నుంచి మణిపూర్ వెళ్లేందుకు రెండు గంటలు మాత్రమే పడుతుంది. అయినా అక్కడకు వెళ్లేందుకు సమయం దొరక్కపోవడం బాధ కలిగిస్తోంది.
♦ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో అసత్యాలు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవు. తాజాగా ఉగ్రవాదులు అక్కడ సైన్యంపై దాడి చేసి కల్నల్, మేజర్, డీఎస్పీ, రైఫిల్‌మెన్‌ను హత్య చేశారు. ఆ సమయంలో కేబినెట్ సమావేశం నిర్వహించి జీ20 సమావేశాలు విజయవంతం చేశామని సంబురాలు చేసుకున్నారు.
♦ మణిపూర్, కశ్మీర్‌లో అంతర్గత భద్రతకు భంగం ఒకవైపు, చైనా ఆక్రమణ మరోవైపు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు చర్చలు జరిపినా ఉపయోగం లేదు. చైనా ఇంచు కూడా వెనక్కు తగ్గలేదు. చైనా పూర్వ స్థితిలోనే ఉందని మొన్నటివరకు అనుకున్నాం. కానీ నానాటికీ చైనా ఆక్రమణ ప్రమాదకర స్థాయికి వెళుతోంది. మనం భూభాగాన్ని కోల్పోతున్నాం.
♦ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రాజ్యాంగంపై దాడి చేయడమే. మేం దాన్ని తిరస్కరిస్తున్నాం. ఇది జరగాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇలా చేసేందుకు తగిన సంఖ్యాబలం కావాలని బీజేపీకి కూడా తెలుసు. కానీ, ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకే ఇలాంటి చర్చను కేంద్రం తెరపైకి తెస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లుకు సవరణను ఈ సమావేశాల్లో పెడుతున్నారని తెలిసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసే ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తాం.
♦ రెండో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పశ్చిమ దిశగా జరగాలని సీడబ్ల్యూసీ సభ్యులు అడిగారు. దీన్ని సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంటుంది.
♦ సీడబ్ల్యూసీ సభ్యులందరూ ఇండియా కూటమి ఏర్పాటును స్వాగతించారు. సీట్ల సర్దుబాటు త్వరగా చేయాలని ఒకరిద్దరు సభ్యులు చెప్పారు. కానీ, ఆ సర్దుబాటు పని సీడబ్ల్యూసీది కాదు. 14 మంది సభ్యుల ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీది.
♦ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇక్కడ సమావేశాలు నిర్వహించడం వెనుక కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నాయకులందరూ సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడారు. వారి రాష్ట్రాల పరిస్థితుల గురించి చెప్పారు.
♦ సనాతన ధర్మంపై సీడబ్ల్యూసీలో ఎలాంటి చర్చ జరగలేదు. మేము సర్వధర్మ సంభావ్‌ను నమ్ముతాం. తాము మాట్లాడింది మతాల గురించి కాదని, కుల వ్యవస్థ, కులాల పేరుతో అణచివేత, మహిళలు, దళితుల అణచివేత గురించి మాట్లాడామని డీఎంకే వర్గాలు చెప్పాయి. మేం ఆ వివాదంలోకి వెళ్లం.
♦ ఇండియా అంటేనే భారత్. ఇండియా భారత్‌గా మారినందుకు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఇవన్నీ తప్పుడు వివాదాలు. అంబేడ్కర్ చెప్పినట్టు ఇండియా అంటేనే భారత్. మేం దాన్నే నమ్ముతాం.
♦ గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. క్రూడ్ ఆయిల్, అసోసియేటెడ్ గ్యాస్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. కానీ ఈ ధరలు పెంచడం ద్వారా కేంద్రం లబ్ధిపొందింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. అందుకే ఆ వాగ్దానాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment