![Gaddar to contest in Munugode Bypoll on PSP ticket - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/7/munugode.jpg.webp?itok=5zA8XIK5)
సాక్షి, హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో దిగనున్నారు. గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని, ఆహ్వానాన్ని మన్నించి తమ పార్టీలోకి వచ్చారని, ఆయనను మునుగోడు అభ్యర్థిగా ఖరారు చేశామని ఆ పార్ట అధినేత కేఏ పాల్ ప్రకటించారు.
బుధవారం ఇక్కడ అమీర్‌పేట అపరాజిత కాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న తనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. నోటు తీసుకుని ఓటు వేయడం రాజ్యాంగం ప్రకారం నేరమని, ఇదే విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
నోటు తీసుకోకుండా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం, మద్దతు కోసం వెంటనే ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. ఉన్నత విలువలు కలిగి తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని ధారపోస్తున్న గద్దర్ తమ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గద్దర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఈ నెల 2న జరగాల్సిన ప్రపంచశాంతి సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను కేఏ పాల్ విరమించారు. ఆయనకు గద్దర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
చదవండి: (KCR BRS Party: 'బీఆర్‌ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోం')
Comments
Please login to add a commentAdd a comment