యోగి ఆదిత్యనాథ్ గడచిన ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రశంసించే వారి సంగతి పక్కన పెడితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆయన విధాన నిర్ణయాలను తప్పు పట్టే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రైతులు ఆయన ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరకు రైతులు తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని గగ్గోలు పెడుతుంటే, ప్రభుత్వ గోశాలలకు తరలించిన పశువులు ఎక్కడ పోతున్నాయని రైతులు నిలదీస్తున్నారు. వ్యవసాయానికి పనికిరాని పశువులను కబేళాలకు తరలిస్తున్నారంటూ యోగి ప్రభుత్వం వాటి సంరక్షణకు గోశాలలు ఏర్పాటు చేసింది. తమ వద్ద ఉండి వృద్ధాప్యంలోకి వచ్చిన పశువులను కబేళాలకు తరలించకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గోశాలలు రైతుల నమ్మకాన్ని కోల్పోయాయి. దానికి తోడు తమ పశువులను గోశాలకు అప్పగిస్తే ఒక్కోదానికి రూ.ఐదు వేలు చెల్లించాలి. ఇంతే కాదు అవసరమయ్యే దాణా ఖర్చు భరించాలి.
యోగి సర్కార్ ఈ నిబంధన పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మీరట్ సమీపంలోని ఖతూలీ నియోజకవర్గం కేంద్రానికి సమీపంలో ఉన్న భైంసీ గోశాలలో రైతులు అప్పగించిన పశువులు కొద్ది రోజులకే బయటకు వదులుతున్నారు. ‘మా గ్రామం నుంచి గడచిన ఏడాది కాలంలో రమారమి 500 పశువులను అప్పగించాము. మూడు మాసాల తరువాత వెళ్లి చూస్తే 50 కూడా లేవు. మరి మిగిలినవి ఏమయ్యాయని గోశాల నిర్వాహకులను ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా... ప్రభుత్వమే వాటిని కబేళాలకు తరలిస్తోందా?’ అని భైంసీ రైతు బ్రిజ్‌పాల్ సింగ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేము దాణాకు డబ్బులు ఇస్తున్నాము. అయినా వాటిని ఎందుకు కాపాడటం లేదు. ఇక గోశాల దేనికి మా దగ్గర డబ్బులు లాగటానికా’ అని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మీరట్, ముజఫర్‌నగర్ డివిజన్లలో పాతిక గోశాలలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో పశువులు రెండు మూడు మాసాలకే మాయమవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోశాల నుంచి బయటకు వచ్చిన పశువులు తమ పంట పొలాలను పాడు చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. గడచిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన ఇక్కడి రైతాంగం ఇప్పుడు సమాజ్‌వాదీ–రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెబుతున్నారు.
చదవండి: (UP Assembly Election 2022: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!)
ఫ్యాక్టరీలకు మేలు చేస్తున్న ప్రభుత్వ విధానాలు
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చక్కెర రైతులు ఏకంగా ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో 2.60 లక్షల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. ముజఫర్ నగర్, మీరట్, భాగ్పట్, దాద్రి ప్రాంతాల్లోకి చక్కెర మిల్లులు ఏటా 140 రోజుల పాటు చెరకు క్రషింగ్ చేస్తాయి. సగటున రోజుకు లక్ష టన్నులను ఈ ఫ్యాక్టరీలు క్రష్ చేస్తాయి. ‘ఫ్యాక్టరీల బాగు కోసమే మేము చెరకు పండిస్తున్నామన్నట్టుంది ప్రభుత్వం తీరు. మా బాగోగుల కంటే ఫ్యాక్టరీలకు మేలు చేయడంపైనే పాలకుల దృష్టి ఉంది. క్వింటాల్‌కు రూ. 350 నుంచి రూ.400 పెంచాలన్న మా డిమాండ్‌ను కేంద్రం, రాష్ట్రం రెండూ పట్టించుకోలేదు’ అని భాగ్పట్ కు చెందిన రైతు భీరంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాము ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నామని భీరంసింగ్ చెప్పారు. చెరకు పండించే ప్రాంతాల్లో రైతులు వరుస సమావేశాలు నిర్వహించుకుని బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలన్న తీర్మానాలు చేస్తున్నారు.
ఎన్నికలొస్తేనే గుర్తుకొస్తామా!
‘మాకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో బీజేపీకి ఓట్లు వేశాము. ఇప్పుడే మా బాధలను వారు పట్టించుకోవడం లేదు. తీరా ఎన్నికలు వస్తే గానీ అమిత్ షాకు మేము గుర్తుకు రాలేదా?
– దాద్రి ప్రాంతానికి చెందిన రైతు నాయకుడు కిషన్ గుజ్జర్
ఉద్యోగావకాశాలు లేక నిస్పృహలో యువత
రైతులు మాత్రమే కాదు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. కొత్తగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కరోనా కారణంగా యూపీలో వందలాదిగా చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాపు 3.25 లక్షల మంది ఉపాధి అవకాశాలకు గండి పడింది. రైల్వే బోర్డు ఉద్యోగాలకు సంబంధించి బిహార్‌లో చెలరేగిన సెగ ఇప్పుడు యూపీకి పాకింది. ఉద్యోగాల కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేసుకున్న యువతకు కాల్ లెటర్లు రావడం లేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఈ ప్రభుత్వంలో ఇలాంటివి తాము ఊహించలేదని మీరట్ నిరుద్యోగ యువజన సమితి నేత దిలీప్ భండారీ అన్నారు. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా వీధుల్లో తిరుగుతున్నారని, ప్రభుత్వానికి తగిన కార్యాచరణ లేకపోవడమే దీనికి కారణమని మండిపడ్డారు.
పశ్చిమను ఫాలో అవుతారా?
ప్రస్తుతం పశ్చిమలో ఉన్న పరిస్థితులు మొత్తం రాష్ట్రం ఫాలో అవుతుందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ‘కొన్నిసార్లు తీర్పు రాష్ట్రమంతటా ఒకేలా ఉంటుం ది. ఉదాహరణకు 2017 శాసనసభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు సాగడంతో ఓట్ల చీలిక కారణంగా బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఈసారి ఓట్ల చీలిక లేకపోతే పోటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండవచ్చు’ అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్‌మెంట్ సొసైటీ (సీఎస్‌డీఎస్) ప్రతినిధి ప్రభాత్ కుమార్ అన్నారు.
ముస్లింలలో ఓట్లు చీలకూడదనే పట్టుదల
గడచిన ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)కి ఓట్లు వేసిన ముస్లింలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ‘మా గమ్యం ఏమిటో మాకు తెలిసి వచ్చింది. మేము ఎవరికీ ఓటు వేయాలన్న విషయంలో స్పష్టత వచ్చింది’ అని ఖతూలీకి చెందిన వ్యవసాయ పరికరాలు విక్రయించే వ్యాపారి న్నౌషద్ మోనీ చెప్పారు. ‘నేను గతంలో బహెన్‌జీ పార్టీ (బీఎస్పీ)లో ఉన్నాను. మా ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమే. అందుకే నేను ఇప్పుడు ఎస్పీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నా’ అనిమోనీ అన్నారు. ‘నేను సైకిల్ గుర్తుకు ఓటేస్తా. నేనే కాదు నాకు తెలిసిన అందరూ ఈసారి గంపగుత్తగా సమాజ్‌వాదీ పార్టీకే ఓటు వేస్తారు. మా మీటింగుల్లో కూడా అదే చెపుతున్నారు’ అని.ముజఫర్‌నగర్ మార్కెట్లో రోడ్డు పక్కన పాత వస్త్రాలు విక్రయించే షాహీల్ తెలిపారు. ఇతర పార్టీల్లో ముస్లిం అభ్యర్థులు ఉన్నా సరే ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమికి ఓటు వేయాలంటూ ముస్లింలు నిర్ణయించుకున్నారని ముజఫర్‌నగర్ కేంద్రంగా పని చేస్తున్న అమర్ ఉజాల పత్రిక బ్యూరో చీఫ్ మదన్‌లాల్ బహియాన్ చెప్పారు.
సెస్సు వేసినా...
2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా యూపీ పగ్గాలు చేపట్టగానే గోసంరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటైపోయింది. గోవుల ఆలనాపాలనా చూడటానికని చెప్పి... 2019లో టోల్‌ట్యాక్స్‌లపై 0.5 అదనపు సెస్ వేశారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల అమ్ముకునే పంట ఉత్పత్తులపై మండీ ట్యాక్స్‌ను 1 నుంచి 2 శాతానికి పెంచారు. గోశాళల నిర్మాణానికి 2019–20వ బడ్జెట్‌లో ఏకంగా రూ.447 కోట్లను కేటాయించింది యోగి ప్రభుత్వం. ఆలనాపాలన లేకుండా రహదారులపై తిరిగే ఆవులు, ఎద్దులు, గేదెలను ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి విఫలమైంది. సంరక్షణ కేంద్రాల నుంచి తప్పించుకొని ఈ పశువులు రైతుల పొలాలపై పడి సర్వనాశనం చేయడం ప్రారంభించాయి. దాంతో అన్నదాతల ఆగ్రహం రెట్టిపైంది. దానికి తోడు జాతీయ రహదారులపై వీటి మూలంగా ప్రమాదాలు పెరిగిపోయాయి. మరోవైపు నడుస్తున్న కొన్ని గోశాలల్లోనూ పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. పిడుగుపాటుకు, వర్షాలకు బక్కచిక్కిన మూగజీవాలు చనిపోవడం ప్రజాగ్రహాన్ని పెంచుతోంది.
-కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి
మీరట్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment