కృష్ణా, సాక్షి: గుడివాడ కూటమి రాజకీయాల్లో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెండా దిమ్మపై దాడి ఘటనతో గత అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ - జనసేన కార్యకర్తల బాహాబాహీ కాస్తలో తప్పింది.
నాగవరప్పాడు జంక్షన్‌లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు.
ఈ క్రమంలో.. టీడీపీ వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే.. జనసేన జెండా దిమ్మ పై దాడిని తమ పై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అలాగే..
టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత ధారా నరసింహారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు.
Comments
Please login to add a commentAdd a comment