
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్)/పాలకొల్లు సెంట్రల్: ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయమని, దానికి మించి దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు, ఇతర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా రూ.లక్షల కోట్లు రాష్ట్రానికి అందజేస్తుంటే.. గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలు వాటితో చేపట్టిన అభివృద్ధి పనులకు తమ పేర్లు, స్టిక్కర్లు అంటించుకుని తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర బడ్టెట్‌పై మేధావులతో ఆదివారం నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పొరపాటున చేరిందని, ఆ అంశం అనవసరమైందని తర్వాత గుర్తించడంతో దానిని తొలగించాల్సి వచ్చిందని జీవీఎల్ చెప్పారు. ఈ అంశమే ప్రధానమైనది కదా అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు జీవీఎల్ స్పందిస్తూ.. ఏపీకి ప్రధానం కావచ్చునేమోగానీ, తెలంగాణకు అప్రధానమైనది కదా అని బదులిచ్చారు. సాక్షాత్తూ ప్రధానే రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని, అనైతికంగా విభజన చేశారని అన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో అభ్యంతరమేంటని విలేకరులు ప్రశ్నించగా.. ఇక ప్రత్యేక హోదా అనే అంశం లేనట్లేనన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వినియోగ సమస్యలు, పన్నుల్లో వ్యత్యాసాలు, బ్యాంకుల్లో నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, పౌర సరఫరా సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్, వనరుల అంతరం తదితర అంశాలపై ఆ త్రిసభ్య కమిటీ ప్రధానంగా చర్చిస్తుందని వివరించారు.
రాష్ట్రం చేతుల్లోనే ‘కాపు రిజర్వేషన్’
అంతకుముందు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యను జీవిఎల్ కలుసుకుని కాపు రిజర్వేషన్లపై ఆయనతో చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం రాజమహేంద్రవరం ఏకేసీ కళాశాల రోటరీ రివర్ సిటీ హాలులో బీజేపీ రాష్ట్ర మేధావుల సెల్ కన్వీనర్ వడ్డి మల్లికార్జునరావు అధ్యక్షతన రాష్ట్ర కాపు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంనాటి కాపు రిజర్వేషన్ సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉందన్నారు. ఈ సమస్యను కేంద్రం పరిధిలోకి నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా దీనిపై చర్య తీసుకోవచ్చన్నారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లను వెంటనే అమలుచేయాలని జీవిఎల్ డిమాండ్ చేశారు. నాడు కాపులను చంద్రబాబు మోసం చేశారని, నేడు వైఎస్సార్‌సీపీ కూడా కాపులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోపు కాపు రిజర్వేషన్లను అమలుచేయాలని, లేదంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై తాను ఆరు నెలల నుంచి అధ్యయనం చేశానని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు వచ్చినా రిజర్వేషన్లు అమలు చేయడంలో ఇబ్బందిలేదని, ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని జీవీఎల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment