తాడోపేడో తేల్చుకోవడానికి ఢిల్లీలో తిష్ట
సీటు మార్చకపోతే స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ప్రకటన
కమలం నేతల తీరుతో టీడీపీలో కలవరం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ స్థానం విషయంలో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తు పొసగడం లేదు. ఈ స్థానంపై బీజేపీ నేతలు పట్టువీడడంలేదు. సీటు కచ్చితంగా మార్చాలని.. లేకుంటే స్నేహపూర్వక పోటీకి సిద్ధమని చెబుతున్నారు. ఈ ఎంపీ సీటును ఆశించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మూడేళ్లుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆఖరి నిమిషం వరకు కూటమి పొత్తులో ఈ సీటు తనకే దక్కుతుందని ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే అనూహ్యంగా లోకేష్ తోడల్లుడు, నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్‌కు టీడీపీ తరఫున కేటాయించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని జీవీఎల్, ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ వ్యవహారంలో చంద్రబాబుతో పాటు ఆయన వదిన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలు ఏకమై జీవీఎల్‌కు కాకుండా భరత్‌కు టికెట్ దక్కేలా చక్రం తిప్పారన్న భావనలో వీరున్నారు. విశాఖ బీజేపీలో బలంగా ఉన్న ఒక వర్గం కూటమిలో టీడీపీ అభ్యర్థి భరత్‌ను మార్చి ఆ స్థానంలో జీవీఎల్‌కు కేటాయించాలని కొన్నాళ్లుగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖ బీజేపీ కార్యాలయం ఆవరణలో వీరు సమావేశమయ్యారు. భరత్‌ను మార్పు చేసి జీవీఎల్‌కు ఇవ్వని పక్షంలో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్నేహపూర్వక పోటీకి అనుమతించాలని తమ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారు.
మార్చకపోతే సహకరించలేం..
రెండు రోజుల క్రితం బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీయాదవ్, పార్టీ గాజువాక కనీ్వనర్ కరణంరెడ్డి నర్సింగరావు, మరికొందరు నాయకులు, విశాఖలో ఉంటున్న ఉత్తరాదికి చెందిన 20 మందికి పైగా ముఖ్య నాయకులు తాడోపేడో తేల్చుకోవడానికి ఢిల్లీకి పయనమై వెళ్లారు. వీరంతా శనివారం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ పునియాను కలిశారు. విశాఖలో బీజేపీకి పట్టుందని, గతంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందారని సతీష్‌కు వివరించారు.
జీవీఎల్ విశాఖలో ఉంటూ పార్టీ బలోపేతానికి మూడేళ్లుగా కృషి చేస్తున్నారని, బీజేపీ గెలిచే విశాఖ లోక్‌సభ సీటును గెలుపు అవకాశాల్లేని టీడీపీకి కేటాయించడం పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో పాటు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ కోసం పాటు పడుతున్న జీవీఎల్‌కు కాకుండా ఆమె బంధువైన భరత్‌కు సీటు ఇప్పించుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థి భరత్‌ను మార్చి ఆ స్థానంలో బీజీపీ అభ్యర్థి జీవీఎల్‌కు ఇస్తే గెలుపు తేలికవుతుందని సతీష్‌కు చెప్పారు.
లేనిపక్షంలో కూటమి టీడీపీ అభ్యర్థి గెలుపునకు తాము సహకరించబోమని స్పష్టం చేసినట్టు తెలిసింది. వీరి విజ్ఞప్తిని సావధానంగా విన్న సతీష్.. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డా దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.విశాఖ లోక్‌సభ సీటుపై తగ్గేదే లే అంటున్న బీజేపీ నాయకుల తీరుతో టీడీపీ అభ్యరి్థతో పాటు ఆ పార్టీ నాయకుల్లోనూ కలవరం రేకెత్తుతోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భరత్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తమతో బీజేపీ శ్రేణులు కలిసి రావడం ప్రశ్నార్థకమేనని తేలడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment