
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆశావహుల నుంచి వెల్లువలా దరఖాస్తుల సమర్పణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శనివారం ఒక్కరోజే 1,603 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో గత ఆరు రోజుల్లో మొత్తం అందిన అప్లికేషన్ల సంఖ్య 3,223కు చేరుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
శనివారం దరఖాస్తులిచ్చిన వారిలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు (తమ ఆఫీసు ప్రతినిధి ద్వారా అందజేత), శేరిలింగంపల్లికి గజ్జల యోగానంద్, రాజేంద్రనగర్ నుంచి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, షాద్‌నగర్‌కు మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి, సనత్‌నగర్ సీటుకు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, జనగామ నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు బేజాది బీరప్ప, పాలకుర్తి టికెట్ కోసం సీనియర్ జర్నలిస్ట్ యెడ్ల సతీష్ కుమార్ తదితరులున్నారు.
ఆదివారంతో దరఖాస్తుల స్వీకారం ముగుస్తున్నా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతల చేరిక, బీజేపీ నుంచి ముఖ్యనేతల పోటీకి సంబంధించి కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు ఇంకా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అందువల్ల ఇతర పార్టీల నుంచి బలమైన నేతలొచ్చే కొన్ని నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని పార్టీ కీలక నేతలకు సంబంధించి దరఖాస్తులు లేకుండానే ఆయా స్థానాలకు వారి అభ్యర్థిత్వాలను పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు అనుగుణంగా వలస నేతలతోపాటు పార్టీ ముఖ్య నేతలకు కొంత వెసులుబాటు ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ వంటివి ఎన్నికల దాకా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగనుందని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ఎంపిక చేయాలని కోరుతూ ఆ పార్టీ గజ్వేల్ నేతలు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం సమరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment