సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారులో కీలక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాందీభవన్‌లో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ), రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం కోసం ఆశావహుల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించింది. నియోజకవర్గాల వారీగా వారి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.
ఈ మేరకు పీఈసీ సభ్యుల అభిప్రాయాలతో కూడిన సీల్డ్ కవర్లన్నిటినీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరో సీల్డ్ కవర్‌లో పెట్టి సోమవారం స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 26 నియోజకవర్గాల్లో మెజారిటీ సభ్యులు ఒక్కటే పేరు సూచించారు. ఇక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని చోట్ల 2, కొన్నిచోట్ల మూడు పేర్లకు సభ్యులు టిక్ పెట్టారు. చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే 4 పేర్లు కూడా పీఈసీ సభ్యులు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
ఒక్కొక్కరితో ముఖాముఖి
మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సోమవారం గాందీభవన్‌కు రానుంది. మురళీధరన్, సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలతో కూడిన కమిటీ ఉదయం 10 గంటల నుంచి పీఈసీ సభ్యులతో భేటీ కానుంది. అందరి సభ్యులతో విడివిడిగా మాట్లాడే విధంగా వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది.
వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్న అనంతరం నివేదిక రూపొందించనుంది. ఈ నివేదికపై బుధవారం స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా పాల్గొననున్నారు. ఈ భేటీలోనే స్క్రీనింగ్ కమిటీ 45 నుంచి 50 స్థానాల వరకు ఏకాభిప్రాయం తెస్తుందని, మిగిలిన చోట్ల 2 లేదా 3 పేర్లు సూచించి పూర్తి జాబితాను ఢిల్లీకి పంపుతుందని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) అన్ని స్థానాల్లో ఒక్కో పేరు ఖరారు చేసి సీడబ్ల్యూసీ ఆమోదంతో అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తుందని వివరించాయి.
ఏకాభిప్రాయం వచ్చిన నియోజకవర్గాల వివరాలివి
కొడంగల్–రేవంత్‌రెడ్డి, మధిర–భట్టి విక్రమార్క, హుజూర్‌నగర్– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ–కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగిత్యాల–టి.జీవన్‌రెడ్డి, మంథని–డి. శ్రీధర్‌బాబు, సంగారెడ్డి–టి.జగ్గారెడ్డి, ములుగు–డి. సీతక్క, భద్రాచలం–పొదెం వీరయ్య, ఆంథోల్– దామోదర రాజనర్సింహ, మంచిర్యాల–ప్రేంసాగర్‌రావు, పరిగి–టి.రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం–మల్‌రెడ్డి రంగారెడ్డి, కోదాడ–పద్మావతిరెడ్డి, వికారాబాద్– గడ్డం ప్రసాద్‌కుమార్, జహీరాబాద్– ఎ.చంద్రశేఖర్, బోధన్–సుదర్శన్‌రెడ్డి, నాంపల్లి–ఫిరోజ్‌ఖాన్, భూపాలపల్లి–గండ్ర సత్యనారాయణ, వరంగల్ (ఈస్ట్) –కొండా సురేఖ, నర్సంపేట – దొంతి మాధవరెడ్డి, ఆలంపూర్–సంపత్‌కుమార్, వేములవాడ–ఆది శ్రీనివాస్, హుజూరాబాద్–బల్మూరి వెంకట్, జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి, మక్తల్ – ఎర్ర శేఖర్, నిర్మల్ – కూచాడి శ్రీహరిరావు, చొప్పదండి – మేడిపల్లి సత్యం.
ఇలావుండగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మాజీ మంత్రి కె.జానారెడ్డి ఇద్దరు కుమారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో ఒకరు లేదా జానారెడ్డి బరిలో దిగేందుకు పీఈసీ అనుమతించిందని సమాచారం. జానారెడ్డి తనయుల్లో ఒకరు పోటీలో ఉండాలనుకుంటే జైవీర్‌కు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.
వనపర్తి లొల్లి
వనపర్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆదివారం గాందీభవన్‌కు వచ్చారు. గాంధీభవన్ మెట్లపై నినాదాలు చేస్తూ పీఈసీ సమావేశానికి వచ్చిన సభ్యులను కలిసి చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వద్దని కోరారు.
మా ఆప్షన్లు ఇచ్చాం: జగ్గారెడ్డి
సమావేశం అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ పీఈసీ భేటీలో అభ్యర్థుల ఎంపిక గురించిన దరఖాస్తులను పరిశీలించామని, ఆప్షన్స్ ఇచ్చామని చెప్పారు. సభ్యులందరూ మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా అందజేశారని, అయితే ఎవరు ఏ అభిప్రాయం ఇచ్చారన్నది బయటకు చెప్పలేమని, ఇది రహస్య సమావేశమని అన్నారు.
బీసీలకు కేసీఆర్ కంటే ఎక్కువే ఇస్తాం: రేవంత్
పీఈసీ సమావేశానికి ముందు రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బలమైన బీసీ నేతలందరికీ ఈసారి టికెట్లు ఇస్తామని చెప్పారు. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ పార్టీతో ఎవరూ పోటీ పడలేరని, కేసీఆర్ కంటే ఎక్కువ సంఖ్యలోనే బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు దిమ్మతిరిగే ఎత్తుగడ తమ దగ్గర ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment