సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం స్థానాల్లో నాలిగింటిని ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో మిగతా అభ్యర్థుల ఖరారు కోసం నేడు ఇటు హైదరాబాద్‌లో, అటు హస్తినలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.
బుధవారం ఉదయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మిగిలిన 13 పార్లమెంట్ స్థానాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారామె. ఆయా నియోజకవర్గాల వారీగా.. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతరత్రా నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. టికెట్ ఎవరికిస్తే బాగుంటుందనే దానిపై ఒక్కొక్కరి నుంచి విడివిడిగా ఆమె అభిప్రాయం సేకరిస్తున్నారు. ఏఐసీసీ సూచనల మేరకే అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.
అదే సమయంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ సీఈసీ భేటీ అనంతరం.. మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment