రేవంత్‌ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్‌ | KTR Comments At Karimnagar Parliamentary Meeting | Sakshi
Sakshi News home page

రేవంత్‌ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్‌

Published Thu, Mar 7 2024 3:11 PM | Last Updated on Thu, Mar 7 2024 4:24 PM

KTR Comments At Karimnagar Parliamentary Meeting - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు బండి సంజయ్‌పైనా మండిపడ్డారు. 

.. కరీంనగర్ నుంచే పార్లమెంట్ జంగ్ సైరన్ మోగబోతోంది. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. నాటి ఉద్యమ కాలాన సింహగర్జన సభకు కరీంనగరే వేదికైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై కూడా కదనభేరి సభ కరీంనగర్ నుంచే మొదలు కాబోతోంది. ప్రధాని వచ్చి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలో ఉండి ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు తెలీదు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతాననేటోడు మన ముఖ్యమంత్రి. ఓ జేబు దొంగలా మాట్లాడుతున్నాడు. అవి సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా..?

‘‘రేవంత్‌రెడ్డి బీపీ పెంచుకోకు. మా వైపు నుంచి నీకు నష్టం లేదు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’

.. మానవబాంబులైతామంటున్నాడు రేవంత్. కానీ, ఆయన పక్కనే బాంబులున్నై, అది ఆయన గమనించుకుంటే చాలు. ప్రజలకు కూడా అర్థం కావాలి గాడిదేదో, గుర్రమేదో. చార్సవ్ బీస్ హామీలు అమలు కాకపోతే నిలదీస్తాం. రైతుబంధును రైతుభరోసా అన్నాడు. వచ్చిందా మరి..?. రైతులే ఇప్పుడు రేవంత్ పాలనపై చర్చకు పెడుతున్నారు.. మగాడివైతే రా నువ్వు నిలబడ్డ మల్కాజిగిరికి రా.. నేను వస్తానని సవాల్ విసిరా. కానీ, ఆ ఊసే మాట్లాడుతలేడు. మగాడివైతే ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపాలని రేవంత్ కు సవాల్ విసురుతున్నా.. 

ఆత్మగౌరవం కల్గిన ఏ తెలంగాణా బిడ్డ మాట్లాడని మాటలు మోడీ ఎదుట సాగిలబడి రేవంత్ మాట్లాడుతుండు. రాహూల్ ఏమో గుజరాత్ మాడల్ ను తిడితే.. నువ్వేమో పొగుడ్తావా..?. 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయింది రేవంత్ ప్రభుత్వం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. పైనున్న ప్రాంతాలకు నీళ్లు తెచ్చే ఒక విజన్ తో కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం కట్టాడు. రేవంత్, సంజయ్ వంటి పిచ్చోళ్లకు ఇవన్నీ తెల్వవ్. ప్రాజెక్ట్ లో చిన్న సమస్య వేస్తే రిపేర్ చేయకుండా కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కరువు మీద కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్.

మహానుభావులు ఎంపీలుగా గెలిచిన ఈ ప్రాంతం నుంచి బండి అడ్డిమారిగా గెల్చిండు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదు. దమ్ముంటే బండి సంజయ్ కరీంనగర్ కమాన్ దగ్గరకు రా. మా వినోద్ అన్న ఏం చేసిండో.. నువ్వేం చేసినావో తేల్చుకుందాం. బండి సంజయ్ ఓ సైకో లెక్క తిట్లు  తప్ప చేసిందేమీ లేదు. శివలింగం మీద తేలులాగా పైన రాముడు కింద బండి సంజయ్. పొన్నంను మీ అమ్మకే పుట్టినావా అనే చిల్లరగాడు ఎంపీగా అవసరమా అంటూ సంజయ్ పై ఫైర్. బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ ఐతే కవితపై అసలు కేస్ ఎందుకు అయ్యేది..? కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేస్తే అది బీజేపీ గెలుపుకు కారణమవుతుందనేది అంతా గమనించాలి. ఎన్నికల తర్వాత రేవంత్ మరొక ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వాస్ శర్మ కాబోతున్నాడనేది గ్యారంటీ’’ అని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement