సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే వివిధ నియోజకవర్గాల నుంచి 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 700కు చేరినట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈసారి ఎన్నికల్లో తనకు కొడంగల్ అసెంబ్లీ టికెట్ కేటాయించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు.
ప్రస్తుతం ఆయన కొడంగల్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అనుచరులు, నియోజకవర్గ నేతలు గురువారం గాందీభవన్‌కు వచ్చి రేవంత్ తరఫున దరఖాస్తు అందజేశారు. దీంతో రేవంత్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానికి తెరపడినట్టేనని గాందీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. మధిర టికెట్ కోసం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తన దరఖాస్తును అందజేశారు.సీఎల్పీ కార్యాలయ కార్యదర్శి పూర్ణబోధ శ్రీకాంత్.. భట్టి తరఫున గాందీభవన్‌లో దరఖాస్తును సమర్పించారు.
కాగా, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, జనగామ టికెట్‌కోసం పొన్నాల లక్ష్మయ్య, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, నాగార్జున సాగర్ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డిలు కూడా గురువారమే దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, మునుగోడు టికెట్ కోరుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కై లాశ్‌నేత, కరీంనగర్ టికెట్ కోసం మాజీ అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యారావు కూడా దరఖాస్తులు సమర్పించారు.
కాగా, కాంగ్రెస్ టికెట్లకోసం దరఖాస్తు చేసుకునే గడువు శుక్రవారంతో ముగియనుంది. ఎంపీ ఉత్తమ్‌తోపాటు సీడబ్ల్యూసీ ఆహా్వనితుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు చివరి రోజున దరఖాస్తులు సమర్పిస్తారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment