సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పదును పెట్టింది. పార్టీ ముఖ్యులతో ముమ్మర చర్చలు జరుపుతోంది. శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ నివాసంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కె.లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్‌రావు, జితేందర్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అందిన దరఖాస్తులను పరిశీలించారు.
ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. తనకున్న ప్రజాదరణ, రాజకీయ అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని మల్కాజిగిరి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సీటును ఆశిస్తున్న మురళీధర్‌రావు.. దశాబ్దాలుగా తనకున్న జాతీయ స్థాయి అనుభవం, పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పరిగణనలోకి తీసుకుని పోటీకి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం.
మాజీ ఎంపీ చాడా సురేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి కూడా ఈ సీటును కోరుతున్నారు. ఈ సీటుపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని జైపాల్‌రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, ఆలె భాస్కర్, మురళీగౌడ్ భావిస్తుండగా, మహబూబ్‌నగర్ నుంచి పోటీకి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, శాంతకుమార్ బరిలో ఉన్నారు.
త్వరలో అభ్యర్థుల ప్రకటన: కిషన్‌రెడ్డి
అధిష్టానంతో చర్చించిన తర్వాత త్వరలోనే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని సమావేశానంతరం కిషన్‌రెడ్డి మీడియాకు చెప్పారు. తొలి జాబితాలోనే వీలైనన్ని ఎక్కువ పేర్లు ప్రకటిస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉందని, గ్రామ స్థాయిలో పార్టీలో చేరికల కోసం 25 మంది యువకులు, మహిళలు, రైతులతో కమిటీలు వేస్తామన్నారు. దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిన బీఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్రలోని ఆఫీస్‌కు తాళం వేశారని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment