
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం
పదికాలాల పాటు సుపరిపాలన అందించాలని ఆకాంక్ష
ముఖాముఖిలో సీఎం జగన్‌ను ఆశీర్వదించిన అవ్వాతాతలు
సంక్షేమాభివృద్ధికి మరోసారి పట్టాభిషేకం చేస్తామని ప్రతిన
మండుటెండను లెక్క చేయక ఊరూరా ఘన స్వాగతం
కురిచేడు, వినుకొండలో జన సంద్రాన్ని తలపించిన రోడ్‌షో
‘మేమంతా సిద్ధం యాత్రలో 11వ రోజున నా స్టార్ క్యాంపెయినర్లతో..’ అంటూ సీఎం వైఎస్ జగన్ సోమవారం కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. కొందరు మహిళలు, వృద్ధులు తమ కష్టాలు చెప్పుకోగా.. వాటిని సావధానంగా విన్న సీఎం జగన్.. ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో మమేకమయ్యారు. మండే ఎండలో సీఎం జగన్‌ను చూసేందుకు ఓ అవ్వ రోడ్డు పైకి రాగా.. సీఎం ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ‘పది కాలాల పాటు చల్లంగుండు నాయనా’ అంటూ ఆమె ఆశీర్వదించింది.
అడుగడుగునా జగన్ పాలనకు మద్దతు తెలుపుతూ జనం కదం తొక్కారు. ఇంటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి.. చేతిలో పథకాలను పెట్టిన నాయకుడి వెంటే మేమంతా అంటూ జనం ఎలుగెత్తిచాటారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వెంకటాచలంపల్లిలోని బస శిబిరం నుంచి ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది.
భారీ జనసందోహం నడుమ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన యాత్రకు జన హారతి లభించింది. అనంతరం పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. అక్కసుతోనే తమకు ఆసరాగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు అడ్డుకున్నారంటూ అవ్వాతాతలు ధ్వజమెత్తారు. పదికాలాల పాటు ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించాలని సీఎం జగన్‌కు ఆశీస్సులు అందించారు. వలంటీర్లే కావాలంటూ.. అందుకు మళ్లీ జగనే రావాలంటూ ముక్తకంఠంతో నినదించారు.
కదంతొక్కిన కురిచేడు..
అవ్వాతాతలతో ముఖాముఖి అనంతరం బోధనంపాడు మీదుగా బస్సుయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగింది. మార్గం మధ్యలో సీఎం జగన్ బస్సు దిగి.. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అవ్వాతాతలు, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వ పథకాల అమలు, వాటి వల్ల జరిగిన మంచిని అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపుల అశేష జనవాహిని తమ అభిమాన నేత రాకను మనసారా స్వాగతించింది.
ప్రకాశం జిల్లాలో ఆదివారం జన సునామీని తలపించిన బస్సు యాత్ర.. సోమవారం కురిచేడులోనూ అదే రీతిలో జనసంద్రంగా మారింది. మహిళలు సంక్షేమ సారథి విజయానికి మేమంతా సిద్ధం అంటూ ఘన స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పోటెత్తారు. జన ప్రభంజనానికి అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 వరకు సీఎం జగన్ కురిచేడులో రోడ్‌షో నిర్వహించారు.
ఆ తర్వాత ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోని నూజెండ్ల మండలం చింతలచెరువులోకి బస్సుయాత్ర ప్రవేశించింది. పల్నాడు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఐనవోలు గ్రామ శివారు, చింతలచెరువులో పెద్ద సంఖ్యలో అక్కచెల్లెమ్మలు రోడ్డుపై బారులుతీరారు. పొదిలి జంక్షన్‌లో జన హారతులు అందుకున్న సీఎం జగన్.. వినుకొండ అడ్డరోడ్డులో ప్రవేశించే సరికి మధ్యాహ్నం 3.30 గంటలు అయ్యింది. అనంతరం భోజన విరామం తీసుకున్నారు.
అంతులేని అభిమానం
వినుకొండలో రోడ్ షో అట్టహాసంగా సాగింది. మెయిన్ రోడ్డుతోపాటు శివయ్య çస్తూపం సెంటర్‌లో అభిమానులు గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. రోడ్లు, కూడళ్లు అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. దారి పొడవునా గజమాలలు, తోరణాలతో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతూ.. ఉత్సవాన్ని తలపించేలా ముందుకు నడిపించారు. మేమంతా సిద్ధమంటూ వడివడిగా యాత్ర వెంట నడిచారు. భోజన విరామం అనంతరం వినుకొండలో రెండు గంటలకు పైగా యాత్ర కొనసాగింది.
విఠంరాజుపల్లి, శావల్యాపురం గ్రామాల మీదుగా రాత్రి 8.30 గంటలకు గంటావారిపాలెంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. రాత్రయినా సరే జన నాయకుడిని చూసేందుకు చిన్నా, పెద్దా పోటీపడ్డారు. మార్గమధ్యంలో పలువురు అనారోగ్య బాధితులను చూసి చలించిపోయిన సీఎం జగన్.. వారికి వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించాలంటూ అధికారులను ఆదేశించారు. చింతలపాలెంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు కాన్వాయ్‌తో పోటీపడి పరుగుపెట్టిన యువకుడిని చూసి బస్సు దిగివచ్చి మరీ ఫొటో దిగి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే!
అవ్వాతాతల భావోద్వేగం
సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయంలోని విప్లవాత్మ మార్పులకు తమ ఉజ్వల జీవితాలే నిదర్శనమంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కన్నబిడ్డలు కూడు పెట్టకపోతే పింఛన్ సొమ్ము పొట్ట నింపుతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
చిన్నారి కంటి సమస్యకు పరిష్కారం
వినుకొండ టౌన్: తమ కుమార్తె ప్రైజీ(9) కంటి చూపు సమస్యను పరిష్కరించాలంటూ నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన దంపతులు కీర్తిపాటి అనూరాధ, వేణుకుమార్‌లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విన్నవించారు. చింతలచెరువు గ్రామం వద్ద వారు అర్జీ పట్టుకుని.. తనను కలవడానికి ప్రయత్నిస్తుండటాన్ని గమనించిన సీఎం.. తన సిబ్బంది ద్వారా అర్జీని తెప్పించుకొని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పి పంపారు. అర్జీ ఇచ్చిన గంట వ్యవధిలోనే సీఎంవో నుంచి చిన్నారి తండ్రి వేణుకుమార్‌కు ఫోన్ వచ్చింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష
మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్‌ఎస్‌పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా
అంధురాలి చదువుకు సీఎం అభయం
మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా
జగనన్న ధైర్యమిచ్చారు
మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
– నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా
వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం
నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్‌చైర్‌కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం.
– కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా
చిన్నారి వైద్యసాయానికి భరోసా
మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు.
– పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా
నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు
నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్‌ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
– డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా
సాగర్ జలాలకు హామీ
తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న
ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
– బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
Comments
Please login to add a commentAdd a comment