Huzurabad Bypoll: అస్త్రాలన్నీ విఫలం.. ఫలించని టీఆర్‌ఎస్‌ వ్యూహం  | Huge Shock To TRS In Huzurabad | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll: అస్త్రాలన్నీ విఫలం.. ఫలించని టీఆర్‌ఎస్‌ వ్యూహం 

Published Wed, Nov 3 2021 1:23 PM | Last Updated on Wed, Nov 3 2021 5:29 PM

Huge Shock To TRS In Huzurabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో తాజా ఉప ఎన్నిక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక్కడ గెలుపే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ హుజూరాబాద్‌’ పేరిట టీఆర్‌ఎస్‌ సంధించిన అస్త్రాలన్నీ విఫలమయ్యాయి. ఈటల రాజీనామా నాటి నుంచి ఉప ఎన్నిక పోలింగ్‌ దాకా టీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డినా.. అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. (చదవండి: నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల)

చేరికలతో చేకూరని ప్రయోజనం..:
ఈటలపై అవినీతి ఆరోపణలు వచ్చిన మొదట్లోనే హుజూరాబాద్‌లో పార్టీ యంత్రాంగం చేజారకుండా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జాగ్రత్తపడ్డారు. మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో మంత్రులు కమలాకర్, ఈశ్వర్‌ తదితరుల బృందానికి ‘ఆపరేషన్‌ హుజూరాబాద్‌’ బాధ్యతలు అప్పగించా రు. టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కో–ఆపరేటివ్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలెవరూ ఈటల వెంట నడవకుండా కట్టుదిట్టం చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఈటలపై పోటీచేసిన కాంగ్రెస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డిని, బీజీపీలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కశ్యప్‌రెడ్డిలను, ఆ పార్టీల స్థానిక నేతలను వరుసబెట్టి పార్టీలో చేర్చుకుంది. వివిధ సా మాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రస్థాయిలో ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు వంటి వారికి కేసీఆర్‌ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. కానీ ఈ చేరికలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

నామినేటెడ్‌ పదవులు.. విద్యార్థి నేతకు టికెట్‌..:
టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు ఇచ్చారు. స్థానిక ఎస్సీ నేత బండా శ్రీనివాస్‌ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, గతంలో ఈటలపై పోటీచేసి ఓడిన వకుళాభరణం కృష్ణమోహన్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. కానీ ఈటల రాజకీయ అనుభవం ముందు గెల్లు శ్రీనివాస్‌ అభ్యర్థిత్వం అంత బలంగా పనిచేయలేదని తాజా ఫలితంతో వెల్లడైంది.

ప్రచారానికి కేసీఆర్, కేటీఆర్‌ దూరం..:
హుజూరా బాద్‌లో ఏదో ఒకచోట జరిగే సభలో సీఎం కేసీఆర్‌.. రోడ్‌షోలలో కేటీఆర్‌ పాల్గొంటా రని పార్టీ నేతలు తొలుత ప్రకటించారు. కానీ వారు ఉప ఎన్నిక ప్రచారానికి దూ రంగా ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ప్లీనరీలో మినహా కేసీఆర్‌ ఎక్కడా ఈటల గురించి మాట్లాడలేదు. అయితే  హరీశ్‌ సారథ్యంలోని బృం దం సర్వశక్తులూ ఒడ్డటంతో టీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.  

కేసీఆర్‌ సమీక్ష
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల ను కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం నుంచి సమీక్షించారు. నియోజకవర్గంలో ప్రచారానికి సారథ్యం వహించిన మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌లోని తన ని వాసం నుంచి హుజూరాబాద్‌లోని ఇన్‌చార్జిలతో మా ట్లాడుతూ వివరాలు సేకరించారు. బూత్‌లవారీగా పా ర్టీకి అనుకూలంగా పోలైన ఓట్లపై ఆరా తీశారు. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్‌ ప్ర క్రియ, ఫలితాలపై హరీశ్‌ త్వరలో పార్టీ అధినేతకు సవివర నివేదిక అందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అభివృద్ధి నినాదం.. దళితబంధు పథకం 
టీఆర్‌ఎస్‌ నుంచి ఈటల నిష్క్రమణకు ముందే హుజూరాబాద్‌లో అడుగుపెట్టిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇతర నేతలు.. నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాను తెరమీదకు తెచ్చారు. పెండింగ్‌ పనుల పూర్తి, కొత్త పనులు చేపట్టడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు అందేలా చూడటం, కొత్త పింఛన్ల వంటి అనేక పనులు చేపట్టారు. సుమారు రూ.800 కోట్లతో అభివృద్ధి,  పథకాల అమలును ప్రకటించారు. మరో వైపు సీఎం హుజూరాబాద్‌లో ‘దళితబంధు’పైలట్‌ ప్రాజెక్టును ప్రకటించారు. ఆగస్టు 16న  నియోజకవర్గంలో లబ్ధిదారులతో సభ నిర్వహించారు.  అయినా ఓటర్లు పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపలేదు. 

అడుగడుగునా పార్టీ యంత్రాంగంతో.. 
మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిల పేరిట టీఆర్‌ఎస్‌ పెద్ద సంఖ్యలో నేతలను మోహరించింది. ముగ్గురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 30 మంది నియోజకవర్గంలో మకాం వేయగా.. పొరుగు జిల్లాల నుంచి వందల మంది నేతలు హుజూరాబాద్‌వ్యాప్తంగా తిష్టవేశారు. అయితే బయటి నేతల పెత్తనంపై స్థానిక కేడర్‌లో అసంతృప్తి, బయటి నుంచి వచ్చిన నేతలు చాలాచోట్ల మొక్కుబడిగా పనిచేయడం, ఇన్‌చార్జుల మధ్య సమన్వయం లోపంతో నష్టం జరిగినట్టు పోలింగ్‌ ముగిసిన తర్వాత పార్టీ విశ్లేషించుకుంది.

బీజేపీ, కాంగ్రెస్‌ అవగాహన అంటూ.. 
అవినీతి ఆరోపణలతో ఈటలపై వేటు వేసిన టీఆర్‌ఎస్‌.. ఉప ఎన్నిక ప్రచారంలో ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించకపోవడంతో నష్టం జరిగిందని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంకు ఉండేది. కానీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్‌ జాప్యం చేసిందని.. ఈటలకు అనుకూలంగా ఓట్లు పడేలా కాంగ్రెస్, బీజేపీ లో పాయకారీ ఒప్పందం చేసుకున్నాయని ఆరోపిస్తోంది. దళితబంధు అమ లుపై ఎన్నికల సంఘం ఆంక్షలు కూడా తాము గట్టిగా నమ్ముకున్న ఓ సామాజికవర్గం ఓటర్లలో అయోమయాన్ని సృష్టించందనే భావన టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement