
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు అధికార టీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో దింపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
టీఆర్‌ఎస్‌ను వీడిన ఈటల బీజేపీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడం వంటి పరిణామాలు ఆసక్తిని పెంచాయి. ఇక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార టీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోన్న కేసీఆర్ సర్కారు.. తమ పార్టీ అభ్యర్థి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసి చివరకు గెల్లు శ్రీనివాస్ వైపు మొగ్గు చూపింది.
Comments
Please login to add a commentAdd a comment