
సాక్షి, వరంగల్: ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీగా ఇంటెలిజెన్స్ వర్గాలు మకాం వేశాయి. ప్రధాన రాజకీయ పార్టీల కదలికలు, ఆ పార్టీల విషయంలో ప్రజా అభిప్రాయాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీ ‘గ్రాఫ్’ఎలా ఉందో లెక్కలు కడుతున్నాయి. హైదరాబాద్, పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బంది నియోజకవర్గంలోని కమలాపూర్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు హనుమకొండ, పరకాల, హుజూరాబాద్, కమలాపూర్‌లలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
పథకాలపై ఎలా స్పందిస్తున్నారు?
మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్, టీఆర్‌ఎస్‌కు ఆయన రాజీనామా, బీజేపీలో చేరిక నేపథ్యంలో అధికార పార్టీ, ప్రభుత్వం హుజూరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తి కోసం సుమారు రూ.1,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చే విధంగా దళితబంధు పథకాన్ని ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఈ నెల 16న జమ్మికుంటలో జరిగే సభకు హాజరుకానున్నారు. మరోవైపు పార్టీ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా నియమించి ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు?, అధికార పార్టీ విషయంలో ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారు? తదితర అంశాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి అంచనా..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏ మేరకు ప్రజాదరణ ఉందో అంచనా వేసే పనిలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. 12 రోజుల పాటు కొనసాగిన ఈటల రాజేందర్ పాదయాత్ర, ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆగిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం హుజూరాబాద్‌పై దృష్టి సారించి దీటైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్‌ల పేర్లు ఖరారు కావడంతో మాజీ మంత్రి కొండా సురేఖను పోటీలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వివరాలు సేకరించడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment