సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దుబ్బాక.. నాగార్జున సాగర్.. హుజూర్‌నగర్‌లలో జరిగిన ఉప ఎన్నికలు హుజూరాబాద్ ముందు దిగదుడుపుగా మారబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు సర్వశక్తులు ఒడ్డేందుకు సన్నద్ధమయ్యాయి. హేమాహేమీలను రంగంలోకి దింపుతున్నాయి. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈటల రాజేందర్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. పార్టీ మారి తిరిగి పోటీ చేయబోతున్న కారణంగా ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఏడోసారి విజయం సాధించి తన సత్తా చాటాలని మాజీ మంత్రి ఈటల భావిస్తుండగా, ఈటలను ఓడించడం ద్వారా టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని మరోసారి చూపించాలని అధికార పార్టీ భావిస్తోంది.
ఈటల అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో ఆ పార్టీ యంత్రాంగం హుజూరాబాద్‌లో మోహరించింది. అదే సమయంలో పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేకపోయినా, టీఆర్‌ఎస్.. కేసీఆర్ పేరుతో ఆ పార్టీ జనంలోకి వెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే మండలాల్లో మోహరించారు. త్వరలో గ్రామాలకు కూడా బడా నాయకులు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఈటల టార్గెట్‌గా టీఆర్‌ఎస్ వ్యూహం
టీఆర్‌ఎస్‌ను వీడి, ఎమ్మెల్యేకు రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ను తిరిగి అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే లక్ష్యంతో గులాబీ దళం పావులు కదుపుతోంది. మంత్రులు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇతర ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో ఇప్పటికే పలుమార్లు సమావేశమై హుజూరాబాద్ ఉప ఎన్నికలో అమలు చేసే వ్యూహాలపై చర్చించారు. ఈటల మంత్రిగా బర్తరఫ్ అయిన వెంటనే ఆయనకు మద్దతుగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లకుండా చూడడంలో మంత్రి గంగుల సక్సెస్ అయ్యారు.
నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ పనుల పరిష్కారం, ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించి మంత్రి హరీశ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్సీ వర్గాలను ఆకర్షించడంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తన అనుభవాన్ని వినియోగించారు. మొదటి దశలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తూనే రెండోదశలో మండలాలు, గ్రామాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు సమాయత్తమవుతున్నారు.
టీఆర్‌ఎస్‌తో బీజేపీ సై
- టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల దూకుడుకు గమనిస్తూనే.. ఈటల రాజీనామాతో ఏర్పడిన సానుభూతిని ఉపయోగించుకుంటూ గ్రామగ్రామానికి వెళ్లేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.
- మాజీ ఎంపీ, ఇటీవల గెలిచిన దుబ్బాక ఉప ఎన్నిక ఇన్‌చార్జి ఏపీ జితేందర్ రెడ్డి హుజూ రాబాద్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మినారాయణ, ఎ.చంద్రశేఖర్ సహాయ ఇన్‌చార్జిలుగా నియమితులయ్యారు.
- వీరితోపాటు గురువారం మండలాల వారీగా పార్టీ నేతలను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇన్‌చార్జిలుగా నియమించారు.
- జమ్మికుంట టౌన్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్, రూరల్‌కు మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, హుజూరాబాద్ టౌన్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, రూరల్‌కు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఇల్లందకుంటకు మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి, కమలాపూర్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వీణవంకకు మాజీ ఎమ్మె ల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని నియమించారు.
- మరోవైపు ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున ఆయా మండలాల్లో పర్యటిస్తూ, తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
- త్వరలో జాతీయ స్థాయి నాయకులను కూడా హుజూరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అభ్యర్థి ఉన్నా.. కనిపించని కాంగ్రెస్..
- ఈటలను గెలిపించాలనే పట్టుదలతో బీజేపీ, గులాబీ జెండాకు ఎదురులేదని చాటాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ఇప్పటికే హుజూరాబాద్‌లో మోహరించగా.. వ రుస ఓటముల నుంచి పాఠాలు నేర్వని కాంగ్రెస్ అచేతనావస్థలోనే ఉంది.
- ఈటలకు దీటైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి రెండుసార్లు మీ డియా సమావేశాలు, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లతో సీన్‌లోకి వచ్చారు. అయితే.. ఓ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌తో కౌశిక్‌రెడ్డి చర్చలు రచ్చకెక్కాయి.
- అభ్యర్థి కోసం వెతుకుతున్న టీఆర్‌ఎస్ కు కౌశిక్‌రెడ్డి కూడా ఓ ఆప్షన్ అనే అనుమానాలను నిజం చేశాయి. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్‌కూడా పడిపోయినట్లయింది.
- హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీగా కార్యక్రమాల్లో బిజీగా ఉండగా, కౌశిక్ రెడ్డి గానీ, కాంగ్రెస్ నాయకులు గానీ చడీచప్పుడు లేకుండా ఉండడం గమనార్హం.
- హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కూడా రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది.
- జిల్లా కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ గానీ, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి వంటి నేతలు కూడా చోద్యం చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment