ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయ నేత గెలవడం అంటే...తనకు ఓటేసిన లక్షల మంది ప్రజల ఆశల్ని మోయడం. అంతటి బరువు బాధ్యతల్ని మోసే నేత ఆరోగ్యంగా ఉండాలి..అంతకన్నా ముందు ఆ నేత ఆరోగ్యం గురించి ప్రజలకు తెలిసి ఉండాలి...అది వారి హక్కు అంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ). ఏళ్లనాటి ఈ డిమాండ్ ఇంకా డిమాండ్‌గానే మిగిలి ఉన్న నేపథ్యంలో నేతల ఆరోగ్యంపై అవగాహన నిజంగా ప్రజల హక్కుగానే భావించాలా? అయితే ఎందుకు?
2015లో జరిగిన ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు తమ ఆర్థిక పరమైన ఆస్తులను ప్రకటించినట్లే తమ ఆరోగ్య స్థితిగతుల్ని కూడా ప్రకటించాలని ఐఎమ్‌ఎ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాబోయే ఐదేళ్లపాటు రాజకీయ ఒత్తిడిని తట్టుకుంటూ ప్రజాసేవ చేయగలరా లేదా అని తెలుసుకోవడం తమ అభ్యర్థుల ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ఓటరు హక్కు ’’ అని అప్పటి ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెకె అగర్వాల్ స్పష్టం చేశారు.
అది తప్పనిసరి చేయాలి..
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు, అభ్యర్థి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలి. వైద్య పరీక్షలో ముందుగా ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధిని గుర్తిస్తే సదరు అభ్యర్థి ఉద్యోగానికి అనర్హులవుతారనేది మనకి తెలుసు. అలాగే క్రీడల్లో కూడా ఫిట్‌నెస్ పరీక్ష జరపకుండా ఆడటానికి అనుమతించరు.
అలాంటప్పుడు పాలనకు బాధ్యత వహించే రాజకీయ నేతను ఎలా అనుమతిస్తారు? ప్రపంచంలోని అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేత ఆరోగ్యాన్ని తనిఖీ చేయకుండా ఎన్నికలలో పోరాడటానికి అనుమతివ్వడం సరైనదేనా? అనేవి కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలే. దీనిని దృష్టిలో ఉంచుకునే... ‘‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య వివరాలు వెల్లడించడం తప్పనిసరిగా మార్చి దీని కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని నొక్కి చెప్పారు అప్పటి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎ మార్తాండ పిళ్లై.
యువతపై ప్రభావం...
మన దేశంలో రాజకీయ నాయకులను సెలబ్రిటీలుగా పరిగణిస్తారని, వారి ఆహారపు అలవాట్లు జీవనశైలి యువ తరాన్ని ప్రభావితం చేస్తాయని ఐఎంఏ అంటోంది. నేతలు ఊబకాయంతో ఉండడం అలాగే పొగ తాగటం లేదా మద్యపానం వంటి దురలవాట్లు కలిగి ఉండడం... యువ తరానికి తప్పుడు సందేశం ఇస్తుందనేది తమ ఆందోళనగా పేర్కొంది.
రాజకీయ నేత... అట్టడుగు స్థాయిలో పని చేయగలమని, శారీరకంగా చురుగ్గా ఉన్నామని, ఏ సమయంలోనైనా ఆకస్మిక విపత్తు సంభవించిన ప్రదేశాలకు రాగలమని, మైళ్ల దూరం నడిచి ప్రజలకు కావలసిన సేవలు అందించగలమనే నమ్మకం ప్రజలకు అందించాలి. ఐఎంఎ నాటి ప్రతిపాదనలోని ఔచిత్యాన్ని నేతలు ఇప్పటికైనా గుర్తించి...తప్పనిసరి నిబంధన రాకున్నా...ఆస్తుల వెల్లడి తరహాలోనే స్వచ్ఛందంగానైనా తమ ఆరోగ్య వివరాలు వెల్లడిస్తే... అది గొప్ప మార్పుకు దారి తీయవచ్చు.
అనారోగ్యంతో మరణిస్తే...
ఒక నేత తన అనారోగ్యాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే... ఉపఎన్నిక అనివార్యమై. అది ప్రజాధనం వృధాకి కారణం అవుతుంది. నాయకులు అంటే ప్రజలకు సేవకులు అనేది అందరూ చెప్పే మాటే... అయితే ఒడిదుడుకులను ఎదుర్కొని తమకు 5ఏళ్ల పాటు సేవలు అందించే శారీరక మానసిక సామర్థ్యం నేతలకు ఉందో లేదో తెలుసుకోవడం ప్రజల హక్కు కూడా. –డా.బీఎన్‌రావు, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు
ఆరోగ్యంగా ఉంటేనే కదా...చెప్పింది చేయగలరు..
ఏ మనిషైనా ఆరోగ్యం అత్యవసరం అనేది తెలిసిందే. నేతలు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే కదా ప్రజలు గెలిపిస్తారు. ఆరోగ్యం ఉంటేనే కదా నేతలు తాము ఇచ్చిన హామీలు అమలు చేయగలరు. కాబట్టి... నేతల ఆరోగ్య వివరాలు ప్రజల హక్కు అనేది నిర్వవాదం.. దీనిపై తాజాగా ఐఎంఎ ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ...గతంలో చేసిన ఈ డిమాండ్ ఎప్పటికీ సజీవమే అని నేను భావిస్తున్నా. –డా.గుత్తా సురేష్, జాతీయ ఉపాధ్యక్షులు, ఐఎంఏ.
Comments
Please login to add a commentAdd a comment