సాక్షి, హైదరాబాద్: ఏమిటిది? ఎందుకిలా జరిగింది? కారణాలేంటి? పెట్టని కోట లాంటి దుబ్బాకలో ఎదురుదెబ్బ తగలడమేమిటి? ఏయే అంశాలు ప్రభావం చూపాయి? ఎక్కడ లెక్క తప్పింది?.... ఎన్నో, ఎన్నెన్నో ప్రశ్నలు ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను వేధిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి తమకు బలమైన పట్టున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఓటమికి దారితీసిన పరిస్థితులపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం జరుగుతోంది. 2009లో మినహా 2004 నుంచి 2018 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగినా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో 62.5 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ప్రస్తుతం ఓటమి పాలవడానికి అనేక అంశాలు దోహదం చేసినట్లు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. (బీజేపీకి బూస్టే)
ఈ ఏడాది ఆగస్టు 6న ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణించిన నాటి నుంచే ఉపఎన్నిక లక్ష్యంగా బీజేపీ పావులు కదపింది. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ శ్రేణులను కొంతమేర అయోమయానికి గురిచేసింది. రామలింగారెడ్డి మరణంతో ఏర్పడిన ఖాళీ పార్టీలో అంతర్గత సమన్వయాన్ని దెబ్బతీసింది. దివంగత ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్న నేతలు ఆయన కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు దివంగత మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించడం వంటి పరిణామాలు కూడా టీఆర్‌ఎస్ పార్టీ కేడర్‌ని గందరగోళంలో పడేశాయి. ఉపఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాతే పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, అప్పటికే చీలికలు, పేలికలుగా ఉన్న మండల, గ్రామ స్థాయి నాయకులు ఒకతాటిపైకి రావడానికి సమయం పట్టింది. ఇలా మొదట్లోనే అవాంతరాలు ఎదురయ్యాయి. టీఆర్‌ఎస్ టికెట్ దక్కని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేయడం కూడా కొంతమేర ప్రభావం చూపింది.
హరీష్.. అంతా తానై వ్యవహరించినా..!
దుబ్బాక నియోజకవర్గానికి పొరుగునే ఉన్న సిద్దిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఉపఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత కరోనా బారినపడటంతో సుమారు పది రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి వచ్చింది. మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమించి సమన్వయం చేసినా యువత, నిరుద్యోగులు అప్పటికే బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు గుర్తించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లో ఉన్న అంతర్గత కలహాలు, సమన్వయ లోపాన్ని గుర్తించిన బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. (మూడు సార్లు ఓడినా.. పట్టు వదల్లేదు.. )
కరోనా నుంచి కోలుకున్న మంత్రి హరీష్‌రావు దుబ్బాకపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినా పార్టీ కేడర్‌లో అంతర్గత సమన్వయం కోసమే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మొత్తం దుబ్బాకలో మోహరించడం ద్వారా టీఆర్‌ఎస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తాజా ఫలితాలు వెల్లడించాయి. ప్రచారభారాన్ని మొత్తం మంత్రి హరీష్‌రావుపై వేసి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మంత్రులెవరూ ప్రచారానికి వెళ్లకపోవడం కూడా ప్రభావం చూపిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
యువత, నిరుద్యోగులదే కీలకపాత్ర
తొలుత నిరుద్యోగులు, యువతను ప్రభావితం చేసిన బీజేపీ ఆ తర్వాత టీఆర్‌ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. 2018లో కేవలం 22వేలకు పైగా ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రస్తుతం 63వేలకు పైగా ఓట్లు సాధించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పెద్దగా లేనప్పటికీ యువత, నిరుద్యోగులు కాషాయ అనుకూల ఓటింగ్‌ను పెంచడంలో కీలకంగా వ్యవహరించారు. టీఆర్‌ఎస్ అసంతృప్త నేతల వలసలకు మంత్రి హరీష్ అడ్డుకట్ట వేసినా, వీరు పార్టీ అభ్యర్థికి పూర్తిస్థాయిలో సహకరించలేదని బూత్‌ల వారీగా పోలైన ఓట్ల సంఖ్య వెల్లడిస్తోంది. ఆరున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.7వేల కోట్లతో అభివృద్ది చేయగా, 1.69 లక్షల మంది రైతుబంధు, ఆసరా పించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఉన్నారు.
వీరందరినీ టీఆర్‌ఎస్ తమ సాంప్రదాయ ఓటు బ్యాంకుగా భావించినా, ఓటింగ్ మాత్రం భిన్నంగా జరిగినట్లు వెల్లడైంది. తమ కుటుంబసభ్యులను బీజేపీకి అనుకూలంగా మలచడంలో యువత, నిరుద్యోగులు కీలకపాత్ర పోషించినట్లు టీఆర్‌ఎస్ అం చనాకు వచ్చింది. సరిహద్దుల్లో ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో దుబ్బాక అభివృద్ధిని ఓటర్లు పోల్చుకోవడం కూడా టీఆర్‌ఎస్‌కు నష్టం చేసింది. దుబ్బాక లో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని కాంగ్రెస్, బీజేపీ బలంగా ఎత్తి చూపాయి. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న దుబ్బాకలో చేగుంటను మున్సిపాలిటీగా మార్చకపోవడం, బీడీ కార్మికుల పింఛన్లు, ఆసరా పింఛన్‌దారుల వయోపరిమితి కుదించకపోవడం వంటి అనేక అంశాలు టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపించాయి. (గులాబీ తోటలో కమల వికాసం)
సోషల్ మీడియాలో బీజేపీది పైచేయి
‘బీజేపీ సమాజంలో తక్కువ.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ’ అని కేటీఆర్ వ్యాఖ్యానించినా, బీజేపీ మాత్రం సోషల్ మీడియాను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవ డంలో సఫలమైందని టీఆర్‌ఎస్ అంగీకరిస్తోంది. రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో డబ్బులు పట్టుబడిన ఘటన వాస్తవమైనా బీజేపీ నేతలు మాత్రం పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో బీజేపీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీఆర్‌ఎస్ విఫలమైం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముందు రోజు సిద్దిపేటలో ఎమ్మెల్యే క్రాంతిపై దాడి ఘటన, పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారంటూ జరిగిన ప్రచారం వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్‌ఎస్ ఆరోపించింది. తాము సర్వశక్తులు ఒడ్డటం వల్లే.. బీజేపీ దుష్ప్రచారాన్ని తట్టుకుని గెలుపు అంచుల దాకా వెళ్లగలిగామని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment