ఈసీ అయినా డోంట్ కేర్... పోలీస్ వ్యవస్థనూ బ్లాక్‌మెయిల్
ఎన్నికల అక్రమాలే లక్ష్యం.. దుష్ప్రచారమే కుతంత్రం
నాడూ నేడూ కుట్ర రాజకీయం ఇదే
ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం
వాటి తీరుపై ఐపీఎస్ అధికారుల మండిపాటు
పూర్తి ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు
ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రాజ్యాంగం అంటే ఏనాడూ లెక్కలేదు. రాజ్యాంగబద్ధ సంస్థలంటే ఏమాత్రం గౌరవం లేదన్నది జగద్విదితం. ప్రజా విశ్వాసం ఏనాడూ చూరగొనలేని ఆయన ఉపయోగించే ఏకైక కుతంత్రందుష్ప్రచారం. అందుకు సాధనం ఈనాడు, ఇతర ఎల్లో మీడియా. రాజకీయ ప్రయోజనాల కోసం తాను పాల్పడే కుట్రలకు అడ్డువస్తే కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) వంటి రాజ్యాంగబద్ధ సంస్థపైనా దుష్ప్రచారం చేసేందుకు వెనుకాడనని 2019 ఎన్నికల ముందే ఆయన చేతల్లో చూపారు.
ఏకంగా ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేంత బరితెగింపు చంద్రబాబుకే సాధ్యం. కానీ హైకోర్టు తీర్పుతో టీడీపీ కుట్రబెడిసికొట్టడం... ఆ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరపరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే 2024 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు అదే రీతిలో దుష్ప్రచార కుట్రను తెరపైకి తెచ్చారు. ఈసారి కూడా ఏకంగా ఈసీతోపాటు యావత్ పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా విష ప్రచారానికి తెగించారు.
ఈసీ నిర్ణయాలను అధికార వైఎస్సార్‌సీపీ హుందాగా స్వీకరిస్తూ గౌరవిస్తుంటే.... ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా మాత్రం రోజుకో రీతిలో విష ప్రచారంతో రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు కుతంత్రం పన్నుతున్నాయి. ఈ కుట్ర రాజకీయాలపై రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం ఈసీకి ఫిర్యాదు చేయడం తాజా పరిణామం. – సాక్షి, అమరావతి
2019 ఎన్నికల ముందు..
ఈసీ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ సీఎస్ ద్వారా ఉత్తర్వులు
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తప్పదని స్పష్టం కావడంతో సీఎం హోదాలో చంద్రబాబు అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారు. అప్పటి నిఘా విభాగాధిపతిగా ఉన్న తన సన్నిహితుడు ఏబీవెంకటేశ్వరరావు ద్వారా కుట్రలకు తెరతీశారు. దీన్ని గుర్తించిన ఈసీ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు అప్పటి శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లా ఎస్పీలు అడ్డాల వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మలను 2019, మార్చి 26న బదిలీ చేసింది. వారిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులివ్వడంతో పాటు వారికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని స్పష్టం చేసింది. తన కుట్ర బెడిసికొట్టడంతో ఏకంగా ఈసీనే తూలనాడుతూ చంద్రబాబు చిందులు తొక్కారు. ఈసీ ఆదేశాలను అమలు చేసేది లేదని తేలి్చచెప్పారు.
ఈసీ రాజకీయ దురుద్దేశంతో నిర్ణయం తీసుకుందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది కూడా. ఇక చంద్రబాబు ఒత్తిడితో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠా నిఘా విభాగాధిపతిగా ఏబీ వెంకటేశ్వరరావును కొనసాగిస్తున్నట్టు 2019, మార్చి 27న ఉత్తర్వులివ్వడం దేశంలోనే సంచలనం సృష్టించింది. అసలు నిఘా విభాగాధిపతికి ఎన్నికల విధులతో సంబంధంలేదని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. మరోవైపు శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లా ఎస్పీలు తమను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలు తెలుపుతూ ఏకంగా ఈసీకే లేఖ రాయడం కూడా సంచలనమే. అంటే ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగబద్ధ అధికారాలు కలిగిన ఈసీనే చంద్రబాబు ప్రశ్నించారు.
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఈసీ జారీ చేసిన ఉత్వర్వులను కొట్టివేయలేమని హైకోర్టు 2019, మార్చి 28న తీర్పునిచ్చింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా నిఘా విభాగాధిపతిగా ఏబీ వెంకటేశ్వరావును నియమిస్తూ ఉత్తర్వులిచ్చిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను సీఎస్ పోస్టు నుంచి ఈసీ తొలగించింది. దాంతో అధికార యంత్రాంగాన్ని దురి్వనియోగం చేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్న చంద్రబాబు పన్నాగం పూర్తిగా బెడిసికొట్టింది.
2024 ఎన్నికల వేళ..
► మళ్లీ అదే కుట్రకు తెరతీసిన చంద్రబాబు
► పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుతంత్రం
► ఈసీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దుష్ప్రచారం
ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు 2019లో వేసిన పన్నాగం బెడికొట్టినా చంద్రబాబు తీరు మారలేదు. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్న తన వదిన దగ్గుబాటి పురందేశ్వరితో కలసి కుట్రకు తెరతీశారు. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు మొదలు పెట్టారు. వాటిని తనకు వత్తాసు పలికే ఈనాడు, ఇతర పచ్చ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చి అటు ఈసీని ఇటు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభను విజయవంతం చేయడంలో విఫలమైన టీడీపీ ఆ నెపాన్ని పోలీసు అధికారులపై నెట్టివేసేందుకు యత్నించింది. ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా అటు పురందేశ్వరితోనూ ఇటు టీడీపీ నేతల ద్వారా ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయించింది. ఈ నేపథ్యంలో ఈసీ రాష్ట్రంలోని ఒక ఐజీ, అయిదుగురు ఎస్పీలు, ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో కొత్తవారిని నియమించింది. 2019లో చంద్రబాబు వ్యతిరేకించినట్టు ప్రస్తుతం ఈసీ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ వ్యతిరేకించలేదు. ఈసీ నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది.
కానీ చంద్రబాబు మాత్రం తన కుట్రలకు తెరదించ లేదు. అటు ఈసీని ఇటు పోలీసు వ్వవస్థను లక్ష్యంగా చేసుకుని మళ్లీ దుష్ప్రచారానికి తెర తీశారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులకు వ్యతిరేకంగా టీడీపీ కరపత్రంగా ఉన్న ఈనాడు పత్రికలో ‘ వీళ్లా కొత్త ఎస్పీలు’అంటూ ఓ దురుద్దేశపూరిత కథనాన్ని బ్యానర్‌గా ప్రచురించేట్టు చేశారు. ఈసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, కొత్తగా నియమితులైన ఎస్పీలకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారానికి పాల్పడ్డారు.
ఈనాడు పత్రిక తీరును ఖండిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటన జారీ చేస్తే... దానికి కూడా వక్రభాష్యం చెబుతూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా మరోసారి దుష్ప్రచారంతో చెలరేగిపోయాయి. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఎల్లో మీడియా రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీకి, పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా విషం చిమ్ముతోందన్నది స్పష్టమైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టలు, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో పత్రికలు, టీవీ చానళ్లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారుల సంఘం ఈసీకి ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment