విలేకరులతో మాట్లాడుతున్న జగదీశ్‌రెడ్డి, చిత్రంలో కంచర్ల కృష్ణారెడ్డి
కాళేశ్వరంపై కుంగిన పిల్లర్ల పేరిట రాజకీయం
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుతో రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు రుణం ఇవ్వకున్నా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తెచ్చి మరీ సాగు చేసిన రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ నేత మల్లికార్జున్ రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా.. కుంగిన పిల్లర్ల పేరిట రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వెంటనే సమీక్షించాలని, కర్నాటక నుంచి 10 టీఎంసీల నీరు తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కేఆర్‌ఎంబీ ఉన్నా రైతుల కోసం సాగు నీరు ఇచ్చామని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు.
నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి
వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు నీళ్ల మీద పరిజ్ఞానం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు వసూళ్లు, ముడుపుల చెల్లింపులు మొదలు పెట్టారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు బీ టీమ్‌లా పనిచేస్తున్నాయన్నారు. ఈడీ కేసుల పేరిట ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కడం బీజేపీ పనిగా పెట్టుకుందని.. కేజ్రీవాల్, కవిత అరెస్టులే నిదర్శనమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment