రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడంలేదు. కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పార్టీని నడుపుతున్నారు. దీనిలో ఏదో మతలబు ఉంది. పార్టీ నేతలందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించకుండా, వ్యక్తిగత ప్రతిష్ట కోసమే రేవంత్ ఆలోచిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీకి కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేసేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మైండ్‌సెట్ మార్చాలని లేదంటే కాంగ్రెస్ లైన్‌లో పనిచేసే మరో నాయకుడిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి సోమవారం ఆయన లేఖ రాశారు. కాం గ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌లకు కూడా ఈ లేఖ ప్రతులను పంపారు.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం లేదని, కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పార్టీని నడుపుతున్నారని సోనియాకు రాసిన లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. దీనిలో ఏదో మతలబు ఉం దని అనుమానం వ్యక్తంచేశారు. పార్టీ నేతలందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించకుండా, తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం మాత్రమే రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పార్టీకి కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే రైతులను కలిసేందుకు వస్తానని మీడియాను ఇంటికి పిలిపించుకుని ప్రకటన చేశారని, ఈ విషయంలో జిల్లా నాయకులకు ఎవరినీ ఆయన సంప్రదించలేదని వివరించారు.
ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ అభ్యర్థికి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో కూడా పోటీ చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం పార్టీ కోణంలో మాత్రమే ఆలోచించి ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నానని వెల్లడించారు. తాను ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని, పార్టీ కోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేయాల్సిందిగా రేవంత్‌కు సూచించాలని జగ్గారెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment