
మంత్రి జోగి రమేశ్ ధ్వజం
కంకిపాడు: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని దుర్మార్గుడు, మోసగాడు చంద్రబాబు అని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో సీఎం అయ్యారన్నారు. సూట్‌కేస్‌లకు సీట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జోగి రమేశ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాబు రోడ్‌షోకు, ఉయ్యూరు సభకు జనం నుంచి ఏ మాత్రం స్పందన లేదన్నారు.
చంద్రబాబు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, పొర్లాడతాడో, తెగతెంపులు చేసుకుంటాడో, కాళ్ల బేరానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. పనికిమాలిన రాజకీయాలు చేసే ఘనత ఆయనకే సొంతమన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడటం కాదని, కనీసం కుప్పంలో అయినా ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఆరాటపడుతున్నారన్నారు. అయితే కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. వెన్నుపోటు రాజకీయాలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. యూత్ కాంగ్రెస్ నేతగా, వంగవీటి మోహన రంగా అనుచరుడిగా రాజకీయంగా ఎదిగానన్నారు.
వైఎస్సార్ మనసు గెలుచుకున్నానని, జగనన్న పక్కన చోటు దక్కించుకున్నానని తెలిపారు. చంద్రబాబులాగా దొడ్డి దారిలో తాను ఏ పదవీ పొందలేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరు సీటు ఆశిస్తే అడ్డంగా మోసం చేసి నూజివీడు పంపలేదా? అని నిలదీశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీసీ నేత కొనకళ్ల నారాయణకు కనీసం సీటు కూడా ఇవ్వకుండా మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. బోడె ప్రసాద్ ఇక్కడ గెలవలేడని, కాల్‌మనీ, సెక్స్ రాకెట్ అభియోగాలు ఉన్నాయని పక్కనపెడితే ఆయన కుటుంబం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చింది చంద్రబాబు వల్ల కాదా? అని మండిపడ్డారు. మైలవరం సీటు రూ.100 కోట్లకు చంద్రబాబు అమ్ముకున్నాడని దేవినేని ఉమా విమర్శించలేదా? అని ప్రశ్నించారు. మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబని నిప్పులు చెరిగారు
Comments
Please login to add a commentAdd a comment