సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగీ రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమర్థతలేని వ్యక్తిని స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్‌ఈసీ)గా చంద్రబాబు హయాంలో నియమించారన్నారు. ఓటు ఎలా బదిలీ చేసుకోవాలనే ప్రాథమిక విషయం కూడా తెలియని వ్యక్తి మన ఎన్నికల కమిషనర్ అని ధ్వజమెత్తారు. 6 నెలలు పాటు అక్కడ నివాసం ఉంటేనే ఓటు ఎక్కుతుందని తెలియని అసమర్థ వ్యక్తి సీట్లో కూర్చొని చట్టాలు అమలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఏకగ్రీవం అనేది గ్రామంలోని ప్రజలే చేసుకుంటారని, దీనిని ఎస్‌ఈసీ ఎందుకు నిలిపివేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలే ఏకగ్రీవం అవుతుంటే.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దని చెప్పడానికి ఎస్‌ఈసీ ఎవరని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో 90 శాతం పైగా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని, నామినేషన్ వేస్తుంటే అడ్డుకున్నారని ఎవరైనా పిర్యాదు చేశారా అన్నారు.
అలా లేనప్పుడు ఏకగ్రీవాలన్నీ సక్రమమే అని జోగీ రమేష్ పేర్కొన్నారు. ఒకవేళ ఏకగ్రీవాలు వద్దని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లగలరా అని సవాలు విసిరారు. బరితెగించి వ్యవస్థలను నాశనం చేయడానికి వీరు కంకణం కట్టుకున్నారని, అధికారాలను కాలరాయడానికి ఎస్‌ఈసీ ఎవరని మండిపడ్డారు. శిఖండిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు నడిపిస్తున్నారని, ఏకగ్రీవాలనేవి 30 ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోమంటే.. మేనిఫెస్టోను రద్దు చేశారని, మేనిఫెస్టో విడుదల చేసినందుకు బాబుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారం ఉందని ఎస్‌ఈసీ అధికారులను బెదిరిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులకు అనుగుణంగా ఎస్‌ఈసీ తన ప్రవర్తనను మార్చుకోవాలని, చంద్రబాబుకు తొత్తులా ఉండటం ఎస్‌ఈసీ మానుకోవాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment