సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆరోపించారు. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమీక్షా సమావేశం, పార్టీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీలో పాల్గొన్నారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశం కోసం పనిచేశారని నడ్డా అభినందించారు.
బీజేపీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీ వివరాలను చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీడియాకు తెలియజేశారు. ఈ సమావేశంలో కోవిడ్–19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి ఎజెండా, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలను నడ్డా ప్రస్తావించారు. వీటిని పార్టీకి చెందిన వివిధ మోర్చాల ద్వారా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాలి్సన ప్రణాళికలపై చర్చ జరిగింది.
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇన్‌చార్‌్జలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు నియమించిన ఇన్‌చార్‌్జలు ఇచ్చిన నివేదికలపై చర్చ సాగింది. వ్యాక్సినేషన్‌లో ఉచితంగా ఇస్తున్న టీకా డోసులు వంద కోట్లకు చేరువవుతున్నాయని, ఈ ఘట్టాన్ని జాతీయ పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment