కరీంనగర్‌లో మారుతున్న పాలిట్రిక్స్‌.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే! | Karimnagar: Mim Leaders Fires Against Minister Gangula Kamalakar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో మారుతున్న పాలిట్రిక్స్‌.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే!

Published Mon, May 22 2023 9:23 PM | Last Updated on Mon, May 22 2023 9:49 PM

Karimnagar: Mim Leaders Fires Against Minister Gangula Kamalakar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం. మార్పులు ఒకోసారి స్థానిక నేతలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో షాక్‌కు గురవుతున్న ఆ నేత ఎవరు? షాక్లు సొంత పార్టీ నుంచి కాకుండా మిత్రపక్షంగా ఉన్న పార్టీ నుంచి అయితే పరిస్తితి ఎలా ఉంటుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో వస్తున్న మార్పులేంటని తెలుసుకుందాం.

కరీంనగర్ నగరానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ.. మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్‌కు ఆయన చుట్టూ ఉన్నవారి నుంచే సమస్యలు మొదలయ్యాయా? ఆయన కోటరీయే ఇప్పుడాయన కొంప ముంచుతోందా అంటే అవును అనేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో మైనారిటీలు ఉన్నారు. గత రెండుసార్లు మైనారిటీల మద్దతుతోనే గంగుల కమలాకర్ గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదంటున్నారు స్థానిక మజ్లిస్ పార్టీ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొంత కాలంగా సామాన్యులనే కాదు.. మిత్రపక్షంగా ఉన్న తమను పట్టించుకోవడంలేదని మజ్లిస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వార్
ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మైనార్టీ లీడర్స్, ఎంఐఎం నేతలకు మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున నడిచింది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ కావాలనే  చేయిస్తున్నారనే అనుమానాలూ  ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించుకున్న ఎంఐఎం నేతలు.. వెయ్యి కోట్ల రూపాయల విరాళాలు సేకరించైనా కరీంనగర్ లో గాలిపటం జెండా ఎగరేస్తామని చాలెంజ్ చశారు. కొందరు నేతలు పైసలు చల్లితే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నారని.. అంతకుమించిన సినిమా తాము చూపిస్తామనీ సవాల్ విసిరారు. ఇప్పటికే నగరంలోని 35 డివిజన్లలో ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ప్రభావిత శక్తిగా మారినట్లు వారు చెప్పుకొచ్చారు. ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణా హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుస్సేన్ నోటే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటంతో.. కరీంనగర్ లో పొలిటికల్ డైమెన్షన్స్ మారిపోతున్నాయన్న టాక్ నడుస్తోంది. 

సవాల్‌ విసిరారు
అయితే కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఈద్ మిలాప్ పార్టీలో మాట్లాడిన నేతలు.. గులాబీ బాస్ పైనా, మాజీ ఎంపీ వినోద్కుమార్ పైనా తమకున్న సాఫ్ట్ కార్నర్ ను బయటపెట్టారే తప్ప.. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు సానుకూలంగా ఒక్క మాటా మాట్లాడకపోగా.. సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. వినోద్ చొరవ వల్లే స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూనే.. ఎమ్మెల్యే నిధులతో తమ డివిజన్లను అభివృద్ధి చేయాల్సిందేనన్న డిమాండ్ వారి మాటల్లో వినిపించింది. అంతేకాదు, ఎంఐఎం అండదండలతో గెల్చి ఎమ్మెల్యేలు, మంత్రులై ఇవాళ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్పుతామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో దమ్ముంటే ఎంఐఎం అండ లేకుండా గెలిచి చూపించాలనీ గంగులకు ఎంఐఎం నేతలు సవాల్ కూడా విసిరారు. కరీంనగర్ నగరంలోని ముస్లిం మైనార్టీలెక్కువగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి కొరవడిందని.. దర్గాలు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ వంటివాటిని కనీసం పట్టించుకోవడంలేదంటూ స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గంగుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం
కరీంనగర్లో ప్రస్తుత రాజకీయ వాతావరణం గమనిస్తుంటే....వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కరీంనగర్ నుంచి పోటీకి సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ఇలా ఉంటే..గంగులను ఎంపీ స్థానానికి పంపించి.. మాజీ ఎంపీ వినోద్ ను కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలూ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే వినోద్ మాత్రం ఎంపీ స్థానానికే మొగ్గు చూపుతుండగా.. హుస్నాబాద్ నుంచి వినోద్ ను గెలిపించాలన్న కేటీఆర్ ప్రకటనతో ఇక కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ రేసులో వినోద్ ఉంటాడా అన్నది డౌటే..? వినోద్ పోటీలో ఉంటే ఎంఐఎం నేతల ఆలోచనలో ఏదైనా మార్పు రావచ్చునేమో గాని..గంగుల కనుక మళ్ళీ పోటీ చేస్తే మాత్రం మజ్లిస్ బరిలో దిగడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం ఆధారపడి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement