సాక్షి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మరో మలుపు తిరిగింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీ సైతం క్యాంపులకు శ్రీకారం చుట్టింది. ఉన్న కొద్దిపాటి ఓట్లు చీలిపోకుండా.. అధికార పార్టీ వైపునకు ఆకర్షితులవకుండా కాంగ్రెస్ పార్టీ తాజా క్యాంపులకు శ్రీకారం చుట్టింది. తాజాగా మంథని నియోజవర్గం నుంచి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను హైదరాబాద్ తరలించేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే మంథని నుంచి దాదాపు 40 మంది వరకు ప్రజాప్రతినిధులను హైదరాబాద్‌కు తరలించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలివెళ్లారని సమాచారం.
ఓట్లు చీల్చడమే లక్ష్యం..!
మరోవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు 1000 మంది తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో సహా.. బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్యాంపుల్లో ప్రజాప్రతినిధుల స్థితిగతులను జిల్లా మంత్రులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. ఈలోపు ఉమ్మడిజిల్లాకు చెందిన మాజీమంత్రి శ్రీధర్‌బాబు కూడా తమ పార్టీ ఉనికిని బలంగా చాటుకునేయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేతలను క్యాంపులకు పంపడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టకపోయినా.. అధికార పార్టీ విజయావకాశాలను దెబ్బతీయగలం అనే నమ్మకం రావడంతోనే అధిష్టానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందని సమాచారం.
తొలుత ఉమ్మడి జిల్లాకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నియోజకవర్గ పరిధిలోని నేతలు, అంటే ఉమ్మడి జిల్లా తూర్పు ప్రాంతమైన మంథని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేతలు, తరువాత జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ పరిధిలోని మొత్తం 13 నియోజకవర్గాలకు చెందిన నేతలు హైదరాబాద్‌కు రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందని తెలిసింది.
సోషల్ మీడియాకే పరిమితం
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు ఎల్.రమణ, భానుప్రసాద్‌రావు, రవీందర్‌సింగ్, ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. విచిత్రంగా వీరి మాటలు వినాల్సిన ఓటర్లయిన నేతలు మాత్రం శిబిరాల్లో ఉన్నారు. దీంతో సదరు అభ్యర్థులంతా కేవలం విలేకరుల సమావేశాలు, ప్రతిపక్ష నేతల ప్రసన్నాలు, సమావేశాలు, సోషల్ మీడియాలో ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఓటర్లు లేకుండా జిల్లాలో జరిగిన తొలి ఎన్నికలు ఇవేనని, ఇలాంటి విచిత్ర పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment