సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో కార్యకలాపాల విస్తరణకు వీలుగా పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మార్చుకున్న టీఆర్‌ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అందుకు ఆమోద ముద్ర వేయడమే తరువాయి బరిలో దిగాలని భావిస్తోంది. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి విదితమే.
అయితే పేరు మార్పునకు సంబంధించి ఈసీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై దాదాపు నెలరోజుల క్రితమే సమాచారం ఇచ్చినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘భారత్ రాష్ట్ర సమితి’పేరుతో సారూప్యత కలిగిన మరికొన్ని పార్టీలు కూడా ఉండటంతో టీఆర్‌ఎస్ పేరు మార్పు ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆమోదం తర్వాతే ఆవిర్భావ సభపై స్పష్టత
ఈసీ ఆమోదం లభించిన వెంటనే పార్టీ దేశవ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఆవిర్భావ సభను భారీగా నిర్వహించాలని దసరా రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు.
డిసెంబర్ 9న ఈ సభ నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినా..పార్టీ పేరు మార్పుకు ఈసీ ఆమోదం లభించిన తర్వాతే సభ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశ ముందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే డిసెంబర్‌లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరి చలితీవ్రత పెరిగే అవకాశాలుండటం.. ఆవిర్భావ సభ నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు.
టీఆర్‌ఎస్ ప్రభావం చూపే ప్రాంతాలపై ఫోకస్
‘భారత్ రాష్ట్ర సమితి’కి గుర్తింపు లభించినా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగానే పార్టీ కార్యాచరణ ఉంటుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభావం చూపేందుకు అవకాశమున్న పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.
కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, నాందేడ్, చంద్రాపూర్, నాగపూర్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలతో పాటు తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు అధికంగా ఉండే షోలాపూర్, భివండితో పాటు గుజరాత్‌లోని సూరత్ తదితర ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయడంలోని సాధ్యాసాధ్యాలను కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది.
అన్ని భాషల్లోకి ఫామ్‌హౌస్ ఫైల్స్
‘ఎమ్మెల్యేలకు ఎర’కు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్‌ను అన్ని భాషల్లోకి తర్జుమా చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆడియో, వీడియో టేపుల్లోని సంభాషణలను అన్ని భాషల్లో సబ్ టైటిల్స్ తయారు చేసి వివిధ ప్రసార, ప్రచార, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
చదవండి: ఫీ'జులుం'పై ఫైన్.. ఒక్కో సీటుపై రూ.2 లక్షల జరిమానా
Comments
Please login to add a commentAdd a comment