మాట్లాడుతున్న కిలివేటి సంజీవయ్య
నాయుడుపేట టౌన్: ‘కురుక్షేత్ర రక్షణ సమితి’ పేరుతో డబ్బులు దండుకునే స్వామిజీని అడ్డం పెట్టుకుని పచ్చదళం తనపై దుష్ప్రచారం చేస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను 2015లో సూళ్లూరుపేటలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొని క్రైస్త్రవుల అభ్యర్థన మేరకు శిలువ లాగిన ఫొటోలను టీడీపీ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి హిందూ వ్యతిరేకిననే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతోనే హిందువులమని, హిందూ మతంపై తనకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పారు.
తాను హిందువుగానే మరణిస్తానన్నారు. తమ కులదైవం కూడా కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి అని చెప్పారు. శాసనసభ్యుడిగా అన్ని మతాలు, అన్ని కులాల వారిని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం, జైన మతస్తుల పండుగ రోజుల్లో వారి ఆహ్వానం మేరకు వెళ్లి వారి మనోభావాల మేరకు వేడుకల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు చర్చికి వెళ్లి శిలువ మోశారని, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సైతం చర్చిలో ప్రార్థనలకు హాజరయ్యారని, అంతమాత్రాన వారు క్రైస్తవులుగా మారిపోతారా అంటూ ఆ ఫొటోలను చూపించి నిలదీశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారని, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. హైందవ ధర్మానికి కట్టుబడి టీటీడీ సభ్యుడిగా సేవలు అందిస్తానని సంజీవయ్య స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment