సాక్షి, న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేంద్రం నిధుల విషయంలో కూడా బీజేపీ సర్కారు తీరుపై గులాబీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి కిషన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రామపంచాయతీ నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆయిలపామ్ సాగును కేంద్రం ప్రోత్సహిస్తోంది. తెలంగాణకు కేంద్రం రూ.5వేల కోట్లు ఇచ్చింది. ఈ నిధులను ప్రభుత్వం దారిమళ్లించింది. పంచాయతీల ఖాతాల్లోకి నిధులు వేసిన గంటలోనే మళ్లించారు. ఉపాధి హామీ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారు. పంచాయతీ నిధుల కోసం సర్పంచ్‌లు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల నిర్బంధం ద్వారా సర్పంచ్‌లు నిధుల కోసం ప్రశ్నించకుండా ప్రభుత్వం వారి గొంతు నొక్కుతోంది.
తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై అదనంగా 13 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం విధించే వ్యాటే ప్రధాన కారణం. కేంద్రం కోరిక మేరకు 13 రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గించే ప్రయత్నం చేయలేదు. ధరలు పెరిగితే పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment