సాక్షి, హైదరాబాద్: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదని.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే ఆ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు.
బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైందని ధ్వజమెత్తారు. అయోధ్య కేసు విచారణ సమయంలోనూ కాంగ్రెస్ వితండ వాదం చేసింది. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అభద్రతా భావంలో ఉంది. హిందువులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకధోరణి మరోసారి బయటపడిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్‌కు భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వంతో భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడుతోంది. హిందుత్వం ఒక మతం కాదు.. జాతీయ జీవన విధానం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే.. సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటి? కాంగ్రెస్ పార్టీ కి వచ్చిన నొప్పి ఎంటి ? పోలీసులకొచ్చిన ఇబ్బంది ఏంటి?. వారం రోజులు తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారు?. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుంది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.
‘‘పార్లమెంట్ సమావేశాలను, G-20 సమావేశాలను, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. ప్రణబ్‌ముఖర్జీకి భారతరత్న ఇస్తే బహిష్కరిస్తారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు జనవరి 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టకు హాజరు అవుతున్నారు. హిందుత్వాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ ఆనవాయితీగా పెట్టుకుంది’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment