సాక్షి, గుడివాడ: చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి’’ అని కొడాలి నాని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్‌లు గుడివాడకి చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేను. నా చివరి వరకు సీఎం జగన్ వెంటే ఉంటానని అని కొడాలి స్పష్టం చేశారు.
కొడాలి నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఈ రోజు గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన మన సీఎం గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, 25 సంవత్సరాల కలను నెరవేర్చడం కోసం మా ముందుకు వచ్చిన సీఎంగారిని నేను, మా గుడివాడ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం, 2004లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అప్పటికి 9 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పట్లో ఈ గుడివాడలో 10 వేల మంది ఇళ్ళు లేని నిరుపేదలు ఉన్నారని నా దృష్టికి రావడంతో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి గారిని అడగాలని, గుడివాడ నుంచి 2007లో ఏప్రిల్ 9 న పాదయాత్రగా బయలుదేరి ఆయన్ను వెళ్లి కలిసి ఈ సమస్య గురించి చెప్పాను. నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిని అయినా ఆయన నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చి చెప్పగానే ఈ సమస్య గురించి నడిచి రావడం ఎందుకు కారులో వచ్చినా నేను కలుస్తాను కదా అన్నారు.
నేను అడిగిన 45 రోజుల్లో ఈ 77 ఎకరాల భూమిని సేకరించి ఇళ్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టిన మహానుబావుడు ఆయన.. ఇది ఆయన భిక్షగా భావిస్తున్నాను.. ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన విగ్రహం పెట్టాం. ఇంత చక్కటి సౌకర్యాలతో ఎటువంటి వంక లేకుండా ఇళ్లను సిద్దం చేసింది ఆయన తనయుడు సీఎం గారు.. చంద్రబాబు 2017 చివరిలో రెండు ఫేజ్‌లకు గాను ఫస్ట్ ఫేజ్‌లో 3400 ఇళ్ళకు దాంట్లో 25 శాతం పైన కట్టిన ఇళ్ళు 1200.రూ. 800 కోట్ల ప్రాజెక్ట్‌కు చంద్రబాబు చెల్లించింది రూ. 180 కోట్లు, అందులో లబ్ధిదారుల నుంచి రూ. 25 కోట్లు వసూలు చేశారు. కేంద్రం ఇచ్చే రూ.130 కోట్లు తెచ్చి ఆ డబ్బు కాంట్రాక్టర్‌కు ఇచ్చి సిగ్గులేకుండా నేను కట్టిన ఇళ్లను జగన్ ఓపెన్ చేస్తున్నారంటున్నారు. కానీ ఈ రోజు రూ. 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఖర్చుపెట్టింది సీఎం జగన్.
వైఎస్ జగన్ పాదయాత్రలో ఇక్కడ బస చేసిన సమయంలో ఈ పరిస్ధితి వివరించాను, వెంటనే ఆయన వాగ్ధానం చేసి నిరుపేదలకు రూ.1 మాత్రమే కట్టించుకుని 300 ఎస్‌ఎఫ్‌టీ ఇంటిని ఉచితంగా ఇస్తున్నారు. ఇవే కాదు ఇక్కడే పక్కా ఇల్లు కూడా కడుతున్నారు. చంద్రబాబు గుడివాడలో నాకు బంధువులు ఉన్నారు, మా సామాజికవర్గం ఉంది అని సొల్లు కబుర్లు చెబుతున్నారు. ఈ గుడివాడలో రెండు రైల్వే గేట్లు ఉన్నాయి. రోజుకు 90 రైళ్ళు వెళుతుంటాయి. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో 14 సంవత్సరాలు కేంద్రంలో చక్రాలు, బొంగరాలు తిప్పి గాడిదలు కాశాడు. గుడివాడకు ఫ్లై ఓవర్లు వేయలేదు. గాలికొదిలేశాడు. కానీ జగన్ దగ్గరకు వెళ్ళి ఈ సమస్య గురించి చెప్పగానే గడ్కరీ గారిని అడిగి శాంక్షన్ చేయించారు.
గుడివాడకు 2005లో వైఎస్సార్ నగరబాటకు వచ్చారు. అప్పట్లో నేను టీడీపీలో ఉన్నాను. దేవినేని ఉమా పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. నాకు ఫోన్ చేసి సీఎం వస్తున్నారు నువ్వు విజయవాడ వచ్చేయన్నాడు. నేను సీఎంని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నాను.. వద్దన్నాడు.. నేను వెళతానన్నాను.. పది నిముషాలలో చంద్రబాబు ఫోన్ చేసి నువ్వు వెళ్ళద్దు అన్నాడు. మనం అధికారంలోకి వస్తాం. నీకు గుడివాడలో ఏం కావాలంటే అది చేస్తామన్నాడు, కానీ నేను నీ సొల్లు కబుర్లు చాలాకాలం నుంచి చూస్తున్నానని చెప్పి సీఎంని కలవడానికి హెలిప్యాడ్ దగ్గరకు వెళ్ళాను. రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఆయన బస్ ఎక్కమన్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. ఆయన్ను లేపి మరీ ఎమ్మెల్యేను కూర్చోబెట్టు అన్నారు.
చదవండి: చంద్రబాబు కొత్త ట్రిక్కు.. ఆ భయంతోనేనా?
ఇక్కడ సమస్యలు చెప్పగానే షెడ్యూల్ లో లేకపోయినా బస్ తిప్పమన్నారు.. సీఎం సెక్యూరిటీ వారు మనం వెళ్ళగూడదన్నా నేను వెళుతున్నా అని వెళ్ళారు. వెంటనే 106 ఎకరాల భూమిని కొని 20 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంప్‌హౌజ్ నిర్మించారు. గుడివాడ ప్రజలకు దాహార్తి తీర్చిన మహానుబావుడు ఆయన. ఆ రోజంతా ఆయనతో తిరిగానని, చంద్రబాబు హైదరాబాద్ పిలిచి ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. చంద్రబాబులా చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదని నేను మిమ్మల్ని కలిశాను అంటే ఇక్కడ సమస్యలు అన్నీ తీర్చారు, ఇప్పుడు ఆయన బిడ్డ జగన్.. ఈ సమస్యలు చెప్పాగానే ప్రతి నిరుపేదకు ఇంటి పట్టా ఇచ్చి ఇళ్ళు కట్టిస్తానన్నారు. మాట నిలబెట్టుకున్నారు.
లక్ష ఎకరాలకు పది లక్షల కోట్లు ఖర్చుపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేదల కోసం రూ. 15 లక్షల కోట్లు సీఎం ఖర్చు పెడుతున్నారు. గుడివాడ నియోజకవర్గానికి వైఎస్‌ఆర్, జగన్ వందల ఎకరాలు కొని నీటి అవసరాలు తీర్చితే చంద్రబాబు ఒక ఎకరం కొన్నారంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చంద్రబాబుకు చాలెంజ్ చేస్తున్నాను. అటువంటి వైఎస్‌ఆర్, జగన్‌తో నీకు పోలికా, చంద్రబాబు నీకు దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయ్, నువ్వు మగాడివైతే పోటీ చేయి, సొల్లు కబుర్లు మానుకో, గుడివాడలో అభివృద్ది పనులు జరుగుతున్నాయి.
రూ. 1500 కోట్లకు పైగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి. గుడివాడ అభివృద్దికి ఇంకా కొంత డబ్బు అవసరం. మీరు వచ్చే ఐదేళ్లు కూడా సీఎంగా ఉంటారు. రాష్ట్రానికి పర్మినెంట్ సీఎం మీరు. మిమ్మల్ని ఆ సీట్ నుంచి దించగల మగాడు ఇంకా పుట్టలేదు. గుడివాడ ఎమ్మెల్యేగా నేనే ఉంటా. వచ్చే ఐదేళ్లలో మిగిలిన సాయం చేస్తే చాలు. ఇక పవన్ కల్యాణ్ మీకు ఒక చాలెంజ్ చేశాడు ఆయన అసెంబ్లీలో అడుగుపెడతాను దమ్ముంటే ఆపు అంటున్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలో అడుగుపెట్టడానికా, ఆయన దేనికి పార్టీ పెట్టాడు సీఎం అవడానికి, కానీ శాసనసభకు వెళ్ళే పరిస్ధితుల్లో కూడా లేడు. ఇద్దరు హీరోయిన్లు ఎంపీలు అయ్యారు, ఈయన మాత్రం శాసనసభలో అడుగుపెట్టడానికి పార్టీ అవసరమా, ఇండిపెండెంట్‌గా కూడా అడుగుపెట్టచ్చు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా, ఈయన ఎమ్మెల్యేగా అవుతారేమో కానీ జగన్ గారిని సీఎం సీట్ నుంచి కదిపే శక్తి, సామర్ధ్యం దేశంలోనే ఎవరికీ లేదు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.
Comments
Please login to add a commentAdd a comment