గుడివాడ టౌన్: పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా మూడున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగుతోందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు 31లక్షల మంది ఉన్నట్లు గుర్తించారన్నారు. వారికి నివాసం కల్పించేందుకు సుమారు 71 వేల ఎకరాలను సేకరించారని తెలిపారు.
రోడ్లు, విద్యుత్, డ్రెయిన్‌లు, నీటి సరఫరా లాంటి కనీస సదుపాయాలను కల్పిస్తూ పొలాలను మెరక చేసి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రూ.వేల కోట్లు వెచ్చించి జగనన్న కాలనీలలో ఇళ్లను నిర్మిస్తుంటే విపక్ష నాయకులకు ఏం చేయాలో తోచక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అనుకూల మీడియాలో పాత ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
71 వేల ఎకరాలను అభివృద్ధి చేసి జగనన్న కాలనీలను నిర్మిస్తుంటే ఏమీ చేయలేదని జనసేన నాయకులు ప్రచారం చేయడం నీచ రాజకీయమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కాలర్ పట్టుకుని ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ఇప్పటం గ్రామంలో ఆక్రమణలను తొలగించేందుకు ఏప్రిల్‌లో నోటీసులు ఇస్తే స్పందించని లోకేశ్ ఇప్పుడు హడావుడి చేయటాన్ని చూసి అంతా నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవిత కాలంలో పులివెందుల నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనైనా టీడీపీ అభ్యర్థిని గెలిపించగలరా? అని సవాల్ చేశారు. కనీసం నారావారి పల్లెలో టీడీపీని గెలిపించుకునే సత్తా ఉందా? అని ప్రశ్నించారు.
ఆలయంలో ప్రమాణం చేద్దామా?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి బంధువులున్నట్లు టీడీపీ ఆరోపించటాన్ని ఖండించారు. ఈడీ కేసులో ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు కాదన్నారు. అరబిందో కంపెనీ నుంచి చంద్రబాబు 2004, 2009, 2014, 2019లో పార్టీ ఫండ్ తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ‘దీనిపై చంద్రబాబు గుడిలో ప్రమాణం చేస్తారా? అందుకు నేను సిద్ధమే’ అని నాని ప్రకటించారు.
జగనన్న కాలనీలు కంటికి కనపడటం లేదా?
Published Fri, Nov 11 2022 4:05 AM | Last Updated on Fri, Nov 11 2022 9:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment