
సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేశారు. పదవి కోసమే షర్మిల.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు వేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించిదని ఎద్దేవాచేశారు.
కాగా, కొడాలి నాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో చంద్రబాబు, పచ్చ బ్యాచ్ సీఎం జగన్‌ను తిడుతున్నారు. తాను తలుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు అంటున్నారు. కానీ, 2019లోనే ప్రజలు చంద్రబాబును హైదరాబాద్‌కు పార్శిల్ చేసి పంపించేశారు. ఇప్పుడు ఆయన చేసేది ఏం లేదు. సీట్లు రాని, మేము పార్టీ నుంచి తీసేసిన వాళ్లు టీడీపీలో చేరుతున్నారు. రేపు టీడీపీ-జనసేన సంకీర్ణంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే, సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగల బెడతారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదు. కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తాం. ముందు తలుపులు తీసి పక్కవారిని ఆహ్వానించడం మాని, తమ పార్టీ మునిగిపోకుండా చూసుకోవాలి.
పదవి కోసమే షర్మిల.. సీఎం జగన్‌పై నిందలు వేస్తున్నారు. షర్మిల గతంలో తెలంగాణ కోసం పార్టీ పెట్టారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు. వైఎస్సార్ ఆశయాలను సాధిస్తానని చెప్పి ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో పుట్టానని ఇప్పుడు షర్మిల చెబుతున్నారు. షర్మిలకు స్టీల్‌ప్లాంట్, పోలవరం ఇప్పుడు గుర్తుకువచ్చాయా?. జీరో పర్సెంట్ ఓట్ల శాతం ఉన్న షర్మిల పార్టీ, ఒక శాతం పర్సెంట్ ఉన్న కాంగ్రెస్‌తో కలిస్తే ఏం జరుగుతుంది. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.
2014లో ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించారా?. 2019 ఎన్నికల్లో షర్మిల ఎక్కడైనా ప్రచారం చేశారా?. గత పదేళ్లలో ఏపీ సమస్యల గుర్తించి కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడైనా పార్లమెంట్‌లో మాట్లాడారా?. ఎంపీగా కూడా గెలుస్తాడో తెలియని రాహుల్ గాంధీ రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తాడు?.రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేని షర్మిల ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.