ఏపీలో ఈనాడు మీడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పడి తెగ ఏడుస్తోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే యువత, ఇతర వర్గాలవారికి ఆటల పోటీలు పెట్టినా సహించలేనంతవరకు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో యువతకు ఆటల పోటీలు పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి జగన్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. నిజానికి ఇది సరికొత్త ట్రెండ్ అని చెప్పాలి. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి యత్నించలేదు.
తప్పుడు వార్తలతో వదంతులు
దీనికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహించాలని తలపెడితే దానిని ఎలా చెడగొట్టాలా అన్న ధ్యేయంతో ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి మరీ నీచంగా ప్రచారం చేశాయి. మొదట ఆట స్థలాలు ఏవి అని కథనాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆట స్థలాలు బురదతో నిండి ఉన్నాయని తప్పుడు ఫోటోలు వేసి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. ఆ తర్వాత ప్రజలు ఈ ఆటలలో పాల్గొనడం లేదని, వలంటీర్లు ఈ ఆటలను బహిష్కరించారని వదంతులు సృష్టించారు.
ఏడుపు తప్ప ఇంకో కారణం లేదు
అసలు ఏపీలో పిల్లలు అడుకుంటే రామోజీరావుకు, రాధాకృష్ణకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? మొత్తం రాష్ట్రం అంతా ఒక్కసారే యువతలో క్రీడల పట్ల ఆసక్తి ఏర్పడుతుందని, తద్వారా ముఖ్యమంత్రి జగన్‌కు మంచి పేరు వస్తుందన్న ఏడుపు తప్ప ఇంకో కారణం లేదు. ఆటల విషయంలో తెలుగు రాష్ట్రాలుబాగా వెనుకబడి ఉన్నాయన్నది ఒక అభిప్రాయం. దానిని దృష్టిలో ఉంచుకుని జగన్ మొత్తం అందరిని ఆటలవైపు మళ్లించడానికి ఒక యత్నం చేశారు. అంతే.. తెలుగుదేశం మీడియాకు ఏదో సందేహం వచ్చేసింది.
యువత అంతా జగన్‌కు జై కొడుతుందేమో అన్న భయం పట్టుకుంది. అందుకే యవత, ప్రజలు ఎవరూ ఆటలలో పాల్గొనడం లేదని, లక్షలలో నమోదు చేసుకున్నా రావడం లేదంటూ ఈనాడు మీడియా తనదైన శైలిలో తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేసింది. గత ప్రభుత్వం హ్యాపీ సండే అంటూ ఒకటి, రెండు నగరాలలో స్టేడియం వద్దో, రోడ్లపైనో స్టేజీ కట్టి చెవులు పగిలేలా డ్రమ్స్ పెట్టి డాన్స్‌లు వేయిస్తే అదేమో గొప్ప విషయంగా ఇదే మీడియా అప్పట్లో ప్రచారం చేసింది.
ఎల్లో మీడియాకే చెల్లింది
ఆటలకు సంబంధించి ప్రభుత్వం ఇంకేమి చర్యలు తీసుకోవాలి! ఎలా అభివృద్ది చేయాలన్నదానిపై వార్తలు రాస్తే తప్పు లేదు. అలా కాకుండా ఇలాంటి చెత్త వార్తలను రాయడం. అది కూడా మొదటి పేజీలో అచ్చేసి తన రాక్షస మనస్తత్వం బయటపెట్టుకోవడం ఈ ఎల్లో మీడియాకే చెల్లింది. ప్రతిదానిలోను రాజకీయం చూడడం,ప్రభుత్వంపై పడి నిత్యం రోధించడం ఇదే కార్యక్రమంగా ఈనాడు పెట్టుకుంది. ఒకప్పుడు స్కూళ్ల, కాలేజీలలో క్రీడా పోటీలు జరిగేవి. జోనల్ పెద్దతిలో కూడా పోటీలు ఉండేవి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అవి ఉన్నా, గత ప్రభుత్వాలు అంత శ్రద్ద చూపకపోవడంతో స్థానికంగా వ్యాయామ ఉపాధ్యాయుల ఆసక్తిపైనే ఇవి నడుస్తున్నాయి.
ఏడుపు మొహంతో వార్తలు రాయాలా?
విద్యా సంస్థలలో కూడా ప్రైవేటు రంగం విస్తృతంగా వ్యాప్తి చెందాక, అసలు ఆట స్థలాలు లేకుండానే అవి ఏర్పాటవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ఎంతసేపు తమ పిల్లలు ఎంసెట్, ఐఐటి, మెడిసిన్ వంటివాటిలో ఎలా సీటు సంపాదించాలన్నదానిపైనే దృష్టి పెట్టడం అలవాటైపోయింది. విద్యార్థులే కాకుండా, ఆయా గ్రామాలలో, పట్టణాలలో యువత, లేదా మధ్య వయసువారు ఆటలకు దూరం అవుతున్నారు. ఇప్పుడు అన్ని వర్గాలకు ఆటలలో పాల్గొనే అవకాశం కల్పిస్తే దానికి కూడా ఈనాడు ఏడుపు మొహంతో వార్తలు రాయాలా? అదేదో తప్పు పని చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు ఉన్న గ్రామ,వార్డు సచివాలయాలను, వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా వాడుకోవాలని తలపెట్టింది.
అయినా ఆటలు ఆగలేదు
నిజానికి గతంలో ఇంత సూక్ష్మ స్థాయిలో ప్రజలను క్రీడలలలో ఇన్వాల్వ్ చేసే అవకాశం లేదు. కొత్త వ్యవస్థలతో అది సులువు అయింది. దానిని ఎలా చెడగొట్టాలా అన్న లక్ష్యంతో ఉన్న ఈనాడు, జ్యోతి వంటి మీడియా వలంటీర్లు సమ్మె చేస్తున్నట్లు, ఆడుదాం ఆంద్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించింది. అయినా ఆటలు ఆగలేదు. ఆటలలో గెలిచినవారికి బహుమతులుగా ఆటలకు సంబంధించిన కిట్లను, నగదు తదితరాలు అందచస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ క్రీడా సంబరాన్ని ఆరంభించారు.
వారిది నీచమైన ఆలోచన
దీనిని బాగా వినియోగించుకుని ప్రజలు తమ మానసిక ఉల్లాసానికి అవసరమైన క్రీడలలో పాల్గొనాలి. ప్రభుత్వం ఆడిస్తోంది కాబట్టి ఎవరూ రాకూడదన్నది రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి నీచమైన ఆలోచన. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక ఇలాంటి ఆలోచన చేసి ఉంటే, అబ్బో మా బాబు ప్లాన్ అదిరింది. ప్రజలంతా అన్ని పనులు మానుకుని ఆటలలో పాల్గొంటున్నారని ప్రచారం చేసేవారు. చంద్రబాబుకు రాని ఆలోచనలు జగన్‌కు వస్తుండడం, ప్రజలకు మేలు చేసేవి, ఉపయోగపడేవాటిని జగన్ ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు సాగుతుండడంతో వారికి పాలుపోవడం లేదు.
ఈ మీడియా ఎన్నడైనా వార్తలు ఇస్తుందా?
ఆయా కార్పొరేట్ స్కూళ్లు,కాలేజీలు ఎక్కడైనా ఆటలను ప్రోత్సహించడానికి వీలుగా మైదానాలను మెయిన్ టెయిన్ చేస్తున్నాయా అన్నదానిపై ఈ మీడియా ఎన్నడైనా వార్తలు ఇస్తుందా అంటే అలా చేయదు. ఎందుకంటే వారితో మాచ్ ఫిక్సింగ్ కనుక. వారితో వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి కనుక. వాటి గురించి రాయకపోతే రాయకపోయారు. ఇప్పుడు మాత్రం విషం చిమ్మతుంటారు. ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో ఆట స్థలాలను చంద్రబాబు హయాంలో ఎన్నడైనా అబివృద్ది చేశారా? నిజంగా అలా చేసి ఉంటే,ఇప్పుడు స్థలాలు లేవు అని ఎల్లో మీడియా ఎందుకు కథనాలు రాస్తోంది.
ఏడవాల్సిన అవసరం ఏముంది?
వాటిని ఎవరైనా ఎత్తుకుపోయారా! చంద్రబాబు అధికారంలో ఉంటే అంతా పచ్చగా ఉన్నట్లు, జగన్ ఉంటే అక్కడ ఏమీ లేనట్లు రాయడం వీరికి అలవాటుగా మారింది. ఇంత దుర్మార్గంగా మీడియా మారడం ఇప్పుడే చూస్తున్నాం. జగన్ ప్రభుత్వం ప్రజలలో క్రీడా స్పూర్తి పెంచడం కోసం ప్రయత్నిస్తుంటే రామోజీ, రాధాకృష్ణ వంటివారు ఏడవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో చోట మొదలు పెడితే కదా.. బాగా ఆడే యువతను కనిపెట్టగలిగేది. వారిని ప్రోత్సహించేది.
అసలేమీ చేయకుండా ఉంటే అప్పుడు ఏమి రాస్తుంటారు. క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇంకేదేదో చెత్తంతా రాస్తారు. జగన్ ప్రభుత్వం ఆటలకు ప్రాధాన్యత ఇచ్చిందన్న సంగతి ప్రజలకు అర్ధం కాకూడదన్న దురుద్దేశంతో విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదారి పట్టించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. ఈ ఆటల పోటీల ద్వారా ఆణిముత్యాలను గుర్తించాలన్న జగన్ సంకల్పం మెచ్చుకోదగిందే. ఈ ఎల్లో మీడియా ఎంత ఏడ్చినా జగన్ పట్టించుకోకుండా తను ఎంచుకున్న దారిలో వెళ్ళి ప్రజల ఆదరణ పొందుతున్నారు. అదే ఆయన బలం.
కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment