మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీలోనే మకాం చేయడంలో ఉద్దేశాలపపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. పలు కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఆయన ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులలో బిజీగా ఉన్నారని,టిడిపి పార్లమెంటు సభ్యులకు దిశా నిర్దేశం చేస్తున్నారని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తోంది. కాని లోకేష్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో, లేదా ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసులో అరెస్టు అవుతానేమో అన్న భయంతో డిల్లీలోనే మకాం చేశారని ఇతర మీడియాలో వార్తలు వస్తున్నాయి. లోకేష్ ఏ కారణంతో ఢిల్లీలో బస చేసినా, దాని ప్రభావం పార్టీపై తీవ్రంగానే ఉందని చెప్పాలి.
తన తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైలులో ఉండగా,ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన లోకేష్ గత వారంపైగా అక్కడే ఉండిపోవడంతో పార్టీ క్యాడర్లో ఒక అనుమానం బలపడుతోంది. ఇంతకాలం తాము ఏ తప్పు చేయలేదని, తమను ఏమి పీకలేరని దురుసుగా మాట్లాడిన లోకేష్ ఇలా చెప్పాపెట్టకుండా ఢిల్లీ వెళ్లడంతో పార్టీ కార్యకర్తలకు కూడా పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే లోకేష్ లు ఈ స్కామ్ లో ఆధారసహితంగానే పట్టుబడ్డారన్న అనుమానం పెరుగుతోంది. ఢిల్లీలో ఉండి ట్విటర్లో సైకో భాషను కొంత వాడుతూ లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నా, ఆయనలోని భయాన్ని ప్రస్పుటంగానే కార్యకర్తలు చూడగలుగుతున్నారు. ఉన్న నలుగురు ఎంపీలు ఆయన చర్చిస్తున్నారని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని లేరు కదా!.
✍️అసెంబ్లీలో సుమారు ఇరవై మంది సభ్యులుంటే ఏమి చేయాలో వారికి పాలుపోకపోతుంటే లోకేష్ ఏమైనా సలహాలు ఇస్తారేమో అనుకున్నవారికి ఆశాభంగం కలిగించారు. ఆయనకు ఉన్న సామర్ద్యం ఇంతేనా అనే ప్రశ్న వచ్చింది. ఎమ్మెల్యేలు సభలో అల్లరి చేసి బయటకు పోవడం మినహా సభలో తమ కేసును వాదించడానికి భయపడ్డారు. బాలకృష్ణ వంటివారు విజిల్స్ వేస్తూ పరువు తీసుకున్నారు. సాధారణంగా రాజకీయాలలో తండ్రి అరెస్టు అయితే.. ఆయన తరపున కుమారుడిగా లోకేష్ ప్రజలలో ఉండి కార్యకర్తలలో విశ్వాసం పెంచవలసి ఉంటుంది. అప్పుడు అరెస్టు అయినా, ధైర్యంగా జనంలో ఉన్నారులే అన్న అభిప్రాయం కార్యకర్తలకు వచ్చేది. కాని ఆయన ఇన్నాళ్లుగా ఢిల్లీలోనే ఉండిపోవడంతో కార్యకర్తలకు భిన్నమైన సంకేతం వెళ్లిపోయింది.ఇప్పుడు తిరిగి ఏపీకి వచ్చినా ఆ భావన పోయే అవకాశం తక్కువ.
నారా లోకేష్ సన్నిహిత సహచరుడు కిలారు రాజేష్ విదేశాలకు పారిపోయారన్న వార్తలు పార్టీని మరింత దెబ్బతీశాయి. యువగళం పాదయాత్ర పేరుతో ఊరూర తిరుగుతూ నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌ను, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను,పోలీసులను దూషించిన లోకేష్ ఇంతగా కేసులకు భయపడతారని ఎవరూ అనుకోలేదు. అధికారంలోకి వచ్చేది తామేనని, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ వారి సంగతి చూస్తానని, రెడ్ బుక్ లో అనేక మంది పేర్లు రాసుకున్నానని, వారందరి సంగతి తేల్చుతానని బెదిరిస్తూ వచ్చిన లోకేష్ భయంతో డిల్లీ పారిపోతారని పార్టీ క్యాడర్ ఊహించలేదు. పార్టీ కార్యకర్తలు ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని లోకేష్ చెబుతుండేవారు. ఇలాంటి దిక్కుమాలిన వాగ్దానం ప్రపంచంలో మరే నేత చేసి ఉండకపోవచ్చు.
✍️ఎవరైనా అల్లర్లు చేయవద్దని, కేసులు పెట్టించుకోవద్దని,ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేయండని చెబుతారు. కానీ లోకేష్ మాత్రం క్యాడర్‌ను రెచ్చగొడుతూ కేసులు పెట్టించుకోండని ప్రచారం చేశారు. దానిని నమ్మిన కొందరు అమాయకులు హింసకు దిగడం, రాళ్లు రువ్వడం వంటివి చేసి జైళ్ల పాలయ్యారు. భీమవరం వద్ద కొందరు యువగళం టీమ్ సభ్యులు రాళ్లు రువ్వుతూ వీడియోలలో స్పష్టంగా కనిపించడంతో పోలీసులు వారిని జైలుకు పంపించారు. అలాగే చంద్రబాబు రెచ్చగొట్టిన ఫలితంగా దాడులు చేసి అంగళ్లులోను, పుంగనూరులలోను వందలాది మంది కార్యకర్తలు అరెస్టు అయ్యారు. వాళ్లలో అనేక మంది పేదవారు ఉన్నారు. కొందరికి బెయిల్ వచ్చినా, తగు స్యూరిటీలు లేక మరికొన్నాళ్లు జైలులోనే ఉండవలసి వచ్చిందట.
బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ నినాదాన్ని టీడీపీ ఇచ్చింది. ఇప్పుడు తండ్రి,కుమారుల భవిష్యత్తుకే గ్యారంటీ లేకపోతే మన భవిష్యత్తుకు భరోసా ఎవరన్న భయం కార్యకర్తలలో ఏర్పడింది.అందుకే పార్టీ నేతలు రెచ్చగొట్టినా సంయమనంగా ఉండాలని మాబోటి వాళ్లం చెప్పేది.
చంద్రబాబు జైలుపాలయ్యాక ఆయన కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాలలో కోట్లు వ్యయం చేసి పెద్ద,పెద్ద లాయర్లను రప్పించారు. లండన్‌లో ఉన్న లాయర్ ను కూడా రంగంలో దించారు. అయినా వారి వాదనలు వీగిపోయాయి. మరి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు చంద్రబాబు కోసం ఆయా వ్యవస్థలలోని వ్యక్తులు పనిచేసేవారన్నది ఎక్కువ మంది భావన. కాని ఇప్పుడు పరిస్థితి మారింది.ఎంతో మందికి గంటల్లో బెయిల్ ఇప్పించిన చంద్రబాబు తనే ఇన్నాళ్లు జైలులో ఉండవలసి రావడం కాల మహిమ అని, విధి అని కొందరు అంటుంటారు. రాజకీయం కాని, పలుకుబడి కాని అన్ని వేళలా ఒకే రకంగా ఉండదని అనడానికి ఇంత కంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు.
✍️మరో వైపు తెలుగు దేశం పార్టీకి మార్గదర్శకత్వం వహించే రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ గా ఉంది. దానికి తోడు టిడిపికి మద్దతు ఇచ్చే మీడియా ఎన్.టి.ఆర్.కుమారుడు బాలకృష్ణను అవమానిస్తోంది. ఆయన నాయకత్వానికి పనికిరాడన్నట్లుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పట్లో పార్టీని బయటకు వచ్చి నడిపించడం కష్టం అని భావిస్తున్నట్లుగా ఆ మీడియా వ్యాఖ్యలు చేస్తోంది. లోకేష్ సతీమణి, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి కొంగు బిగించి రాజకీయ రంగంలోకి రావాలని ఒకటికి పదిసార్లు యెల్లో మీడియా ప్రాధేయపడడం.. టీడీపీ ఎంత బలహీనంగా మారిందో.. ఆ పార్టీ ఎంత అస్తవ్యస్తం అయిందో చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదేమో!
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment