తోచీ తోయనమ్మ తోడికోడలు.. పుట్టింటికి వెళ్లిందని ఒక సామెత. భారతీయ జనతా పార్టీ నేతల తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో మేధావులను,వివిధ వర్గాల ప్రముఖులను కలవడానికి ఆ పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుంది. మంచిదే!. ఆ సందర్భంగా వారు తమకు కాస్త సానుకూలంగా ఉండేవారినో, లేక తటస్థంగా ఉండేవారినో కలిస్తే ప్రయోజనం ఉంటుంది. అలాకాకుండా పూర్తి వ్యతిరేక సిద్దాంతంతో ఉండేవారిని, మరో పార్టీకి ఏజెంట్ గిరీ చేసేవారిని కలవడానికి ఆలోచించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
✍️ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా.. హైదరాబాద్‌లో మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆయన కూడా వీరిని సాదరంగా ఆహ్వానించి ఇంటిలోకి తీసుకువెళ్లారు. ఆయనకు మోదీ పాలనకు సంబంధించిన వివిధ పుస్తకాలను నడ్డా అందించారు. సిద్దాంతాలు వేరైనా ఇలా రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియచేయడానికి రావడం ప్రజాస్వామ్యంలో మంచిదేనని నాగేశ్వర్ అన్నారు. బాగానే ఉంది. నాగేశ్వర్ మర్యాదస్తుడు. అందరితో గౌరవించబడే వ్యక్తి. అంతవరకు ఓకే. అసలు బీజేపీ పెద్దలు ఆయనను కలవడం వల్ల ఏమి ప్రయోజనం వచ్చిందన్నది ప్రశ్న. తెలంగాణ బీజేపీ నేతలే కొందరు ఈ ప్రశ్న లేవనెత్తడం విశేషం. నాగేశ్వర్ వామపక్ష సిద్దాంత భావాలు ఉన్న ప్రముఖుడు.
ఆయన కొంతకాలం సీపీఎం ఆధ్వర్యంలోని ఒక టీవీ చానల్ ను కూడా నిర్వహించారు. వివిధ టీవీ చానళ్లలో విశ్లేషకుడిగా కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. ఇప్పుడు నడ్డా కలవడం వల్ల నాగేశ్వర్ తన భావాలను మార్చుకుంటారని అనుకోజాలం. తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. అందుకు బీజేపీ నేతలు ఇష్టపడతారా? బీజేపీ సిద్దాంతం అంటే అంతగా ఇష్టపడని వ్యక్తి అని తెలిసి కూడా ఆయనను కలవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. గతంలో బీజేపీ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన చరిత్ర కూడా నాగేశ్వర్‌కు ఉంది. రాజకీయ వర్గాలలోను, రాజకీయేతర వర్గాలలోను ఈయన పట్ల చాలా మందికి అబిమానం ఉంది కనుక ఎవరో ఈ భేటీని అభ్యంతరంగా తీసుకోరు. కాకపోతే బీజేపీ తెలంగాణలో గందరగోళంలోనే ఉందన్న సంగతి మరోసారి స్పష్టం అవుతుంది.
✍️ కొంతకాలం క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జర్నలిస్టు ముసుగులో ఉన్న తెలుగుదేశం ఏజెంట్ ఒకరిని కలవబోతున్నారని వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు డైరెక్ట్ ప్రతినిధిగానే కాకుండా ఫిరాయింపులు, రాజకీయ ఆర్దిక లావేదేవీలు వంటివాటిలో క్రియాశీలకంగా ఉంటూ పవర్ బ్రోకర్ గా పేరొందిన జర్నలిస్టును కలవబోతున్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఒకసారి ఈయనను పిలిపించుకుని ఢిల్లీలో మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ కోసం ఈయన బీజేపీపై కారాలు, మిరియాలు నూరారు. కొంతకాలం రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జగన్ ను ఇబ్బందిపెట్టవచ్చని అనుకున్నారు. ఆ దిశగానే పనిచేశారు. ఏపీ బీజేపీలోని ఒక నేతను ఈయన టీవీచానల్ లో డిబేట్ లోనే మరొకరు కొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కొందరు బిజెపిలో చేరి కోవర్టులుగా వ్యవహరిస్తుంటారు. వారందరికి ఈయనే సలహాలు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కలవడమా అని అంతా ముక్కున వేలేసుకున్నారు.
✍️ ఆ తర్వాత కారణం ఏమో తెలియదు కాని అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడంతో ఆ భేటీ అగిపోయింది. నిజమైన బీజేపీ నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడైనా కలుస్తారేమో తెలియదు. జేపీ నడ్డా తన పర్యటనలో ఆ జర్నలిస్టు ఇంటికి వెళ్లకపోవడం గమనించదగ్గ అంశమే అవుతుంది.అంతకుముందు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన అమిత్ షా మరో మీడియా అధిపతిని ఆయన ఫిలిం సిటీకి వెళ్లి కలుసుకుని మద్దతు కోరారు. అయినా ఆ మీడియా అంతగా పట్టించుకోలేదు. అది పూర్తి స్తాయిలో బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తోంది. కేసీఆర్ పాలన గురించి అద్భుతంగా పొగుడుతూ ఎడిటోరియల్ కూడా రాసింది. ఆ మీడియా అధిపతికి తన కారణాలు తనకు ఉండవచ్చు. కానీ అమిత్ షా ఆయన్ని కలవడం వల్ల బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఏముంది?.
✍️ తెలంగాణలో బిజెపి పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక కావొచ్చు. కర్నాటక ఎన్నికల ఓటమి తర్వాత తెలంగాణలో బీజేపీ అయోమయంలో పడిపోయింది. కారణం ఏమైనా దాని గ్రాఫ్ తగ్గుతున్న మాట వాస్తవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ లో చేసిన విమర్శలు ఎలా ఉన్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితను పలుమార్లు విచారించిన తీరు. ఆ తర్వాత పలువురు ఇతరులను అరెస్టు చేసినా, ఆమె జోలికి వెళ్లకపోవడంపై కాంగ్రెస్ పక్షం విమర్శిస్తుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్లుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలికాలంలో బీజేపీపై విమర్శలు తగ్గించడం, కాంగ్రెస్‌పై దాడి పెంచడం చేస్తున్నారు. అంతేకాక దేశస్థాయిలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లకపోవడం, అదే టైమ్ లో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంలో కొందరు మంత్రుల్ని కలవడం, చివరికి అమిత్ షా అప్పాయింట్‌మెంట్ పొందడం అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ, చివరి క్షణంలో అమిత్ షా తో భేటీ రద్దు అయింది.
✍️ మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా ఇప్పుడు కేంద్రాన్ని ఆయా డిమాండ్లపై కలవడంలో రాజకీయం కూడా ఉండొచ్చు. కానీ, రెండు పార్టీల అగ్రనేతల మధ్య ఏదో రాజీయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యాపించాయి. ఢిల్లీలో జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా.. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు చేస్తామని కేటీఆర్ చెప్పడం చిత్రంగానే అనిపిస్తుంది. కేటీఆర్ డిల్లీ టూర్ లో ఉన్నప్పుడే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో డిల్లీలో అమిత్ షా, నడ్డాలు సమావేశం అయి పార్టీ వ్యవహారాలు చర్చించారు. కేటీఆర్‌ను కలవడం వల్ల బిజెపి గ్రాఫ్ మరింత పడిపోతుందని వారు స్పష్టం చేయడంతోనే షా రద్దు చేసుకున్నారని అంటున్నారు. తాము బిజెపితో కలిసిందే బిఆర్ఎస్ కు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా అయితే, వారితో కాంప్రమైజ్ అయితే తాము బిజెపిలో కొనసాగి ప్రయోజనం ఏమి ఉంటుందని వారు ప్రశ్నించారట.
✍️ ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. ఒకప్పుడు మంచి జోష్ వచ్చినా, ఇప్పుడు డల్ అవడంతో బీజేపీ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ నడ్డా, అమిత్ షాలు వచ్చి కేసీఆర్‌ను ఎంత ఘాటుగా విమర్శించినా గ్రాఫ్ పెరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. మొత్తం రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. తెలంగాణలో తాము గెలవలేకపోతే బీఆర్ఎస్ విజయం సాధించడం బెటరా? కాంగ్రెస్ గెలిస్తే లాభమా ? అనేది ఆలోచించుకుంటారు. కచ్చితంగా బీఆర్ఎస్ ఉండడం వల్ల తమకు వచ్చే నష్టం లేదని బీజేపీ వారు అనుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే దాని ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాలపై పడవచ్చు. అందువల్ల ఎన్నికల నాటికి బీజేపీ హడావుడి చేసినా, కాంగ్రెస్ గెలవకూడదనే కోరుకుంటుంది. అది బీఆర్ఎస్‌కు కలిసి వచ్చే పాయింట్ కావచ్చు.
✍️ ఎన్నికల సమయంలో ఆదాయపన్ను ,సిబిఐ , ఈడి వంటివాటిని ప్రయోగించకుండా ఉంటే బీఆర్ఎస్ కు ఇబ్బంది ఉండదు. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై ఈడీ దాడులు చేసింది. అలాగే మెడికల్ కాలేజీలలో అక్రమాలపై దృష్టి సారించింది. అందులో బిఆర్ఎస్ కు బాగా దగ్గరగా ఉండే ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి మేనేజ్ చేసుకోగలిగారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జోరు తగ్గిన బిజెపి ఆయా నియోజకవర్గాలలో కొత్త నేతలను ఇప్పటికైతే ఆకర్షించలేకపోతోంది. మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావు తదితరులు బిజెపి కన్నా కాంగ్రెస్ బెటర్ అనే భావనకు వచ్చారు. వారికోసం బిజెపి విఫల యత్నం చేసింది. ఈ నేపధ్యంలోనే ఈటెల రాజేందర్, రాజగోపాలరెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూడవచ్చన్న వార్తలు వస్తుండడంతో హైకమాండ్ అలర్ట్ అయింది.
తెలంగాణ బిజెపి సీనియర్ నేతలలో ఉన్న విభేదాలు కూడా పార్టీని ఇరుకున పెడుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, మరో నేత డి.కె. అరుణ వంటివారు ఈ వాదనలను ఖండిస్తున్నా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటేనని చెబుతున్నా, జనం సీరియస్ గా తీసుకోవడం లేదు. రాజగోపాలరెడ్డి ఆయా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఎక్కువకాలం బిజెపిలో ఉండరేమోననిపిస్తుంది. రాజకీయాలు మొత్తం మారిపోవడానికి ఒక స్టెప్ చాలు అనడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి ఇలాంటి సందిగ్ద పరిస్థితిలోనే కొట్టుమిట్లాడుతోందని చెప్పాలి.
::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment