మీకు గుర్తుందా! కొద్ది నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్ కాని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ను రౌడీ మంత్రి, బెంజ్ కారు మంత్రి అని, జూదం ఆడించే వాడని, అవినీతి పరుడని, భూ కబ్జాదారు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోకేష్ అయితే తన ఎర్రబుక్ లో గుమ్మునూరు జయరాం పేరు ఎక్కించారు. జయరాంకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడానికి వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒప్పుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కొన్నాళ్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు,లోకేష్ లతో ఏమి బేరమాడుకున్నారో కాని , ఆయన సడన్‌గా టీడీపీలో చేరిపోయారు. అంతే వెంటనే ఆయన పునీతుడు అయిపోయాడు. పరిశుద్దాత్మ అయిపోయాడు. చంద్రబాబే కాదు..ఈనాడు , ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు గుమ్మునూరు జయరాం మంత్రిగా ఉన్నంతకాలం ఎన్ని వ్యతిరేక వార్తలు రాశాయో లెక్కలేదు. జయరాం అంటే ఒక సంఘ వ్యతిరేక శక్తి అన్నంతగా ప్రచారం చేశారు.
సీన్ కట్ చేస్తే ఆయన టీడీపీ అభ్యర్ది అయ్యారు.రామోజీరావు, రాదాకృష్ణ, ఇతర ఎల్లో మీడియా సైలెంట్ అయిపోయారు. జయరాం ఒక ఆదర్శవాదిని చూస్తున్నారు. ఒక పెద్ద నేతను కనుగొన్నారు. దాంతో గుంతకల్ శాసనసభ నియోజకవర్గానికి జయరామ్ను టీడీపీ అభ్యర్దిగా ప్రకటించారు. జయరాం బాగా సంపాదించారని వీరు ఇంతకుముందు ప్రచారం చేశారు కదా!బహుశా అందులో ఏమైనా వాటా చంద్రబాబుతో పాటు,రామోజీ,రాదాకృష్ణ తదితరులకు ఏమైనా పంచారేమో తెలియలేదు. జయరాం వంటి రౌడీకి టిక్కెట్ ఎందుకు ఇస్తున్నారని వీరు రాయలేదు! జయరాం చేరికపై గుంతకల్లో ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన జితేందర్ గౌడ్ వర్గం ఆఫీస్ వద్ద రచ్చ చేసి చంద్రబాబు ఫోటోతో సహా ఆఫీస్ లో కరపత్రాలు మొదలైనవాటిని రోడ్డుపై పోసి తగులపెట్టారు అది వేరే విషయం.
మరో అభ్యర్ధిని చూద్దాం. డిల్లీలో ఆప్ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ లో ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ అరెస్టు అయి ,తదుపరి అప్రూవర్ గా మారి జైలు నుంచి బయటకు వచ్చారు. శ్రీనివాసులురెడ్డి కూడా ఈ కేసులో పలుమార్లు విచారణకు హాజరయ్యారు.ఆ రోజుల్లో టీడీపీ ఈయనపై విమర్శలు చేసేది. ఈనాడు తదితర ఎల్లో మీడియా అంతా రాఘవ అరెస్టుపైన,మాగుంట ఈడి కార్యాలయానికి వెళ్లడంపైన మినిట్ టు మినిట్ ప్రాతిపదికన వ్యతిరేక కధనాలు ఇచ్చాయి. ఈ స్కామ్ నేపధ్యంలో మాగుంట కు టిక్కెట్ ఇవ్వరాదని జగన్ భావించారు. ఒకవేళ వైఎస్సార్‌సీపీ ఇచ్చి ఉంటే ఈపాటికి చంద్రబాబు కొండెక్కి కూసేవారు. ఎల్లో మీడియాకు అయితే కోతికి కొబ్బరి కాయ దొరికినట్లయ్యేది. కాని మాగుంట,ఆయన కుమారుడు ఇద్దరూ తెలుగుదేశంలో చేరారు. అంతే!వారు పవిత్రులయ్యారు. ఎల్లో మీడియా నోరు మూసేసింది.ఇప్పుడు అదే మాగుంట శ్రీనివాసులురెడ్డికి టీడీపీ ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చేసింది. ఒకవైపు బీజేపీ ఈ స్కామ్ పై పలు ఆరోపణలు చేస్తోంది. అయినా వీరికి టీడీపీ వచ్చిందంటే ఏమి అనుకోవాలి?
నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్దిది మరీ చిత్రమైన స్టోరీ.వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైఎస్సార్‌సీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు.ఈ ఎన్నికలలో ఆయనను నెల్లూరు నుంచి పోటీచేయాలని జగన్ కోరారు. ఆయన కూడా సిద్దం అయ్యారు. కొన్ని విషయాలలో అబిప్రాయ బేధాలు వచ్చాయి. ఆయన తన భార్యకు కూడా టిక్కెట్ అడిగితే జగన్ ఇవ్వలేదు. దాంతో ఆయన అలిగారు. వెంటనే టీడీపీ టచ్ లోకి వెళ్లారు. ఆయనను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చేసింది. ఇక్కడ ఆయనకు టిక్కెట్ ఇవ్వడంలో ప్రాతిపదిక ఏమిటంటే ఆర్దికంగా స్థితిమంతుడు కావడమే. ట్విస్ట్ ఏమిటంటే వేమిరెడ్డి వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు ఆయనపై ఆంధ్రజ్యోతి ఎంత దారుణమైన కధనాలు ఇచ్చిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంద్రజ్యోతి రాయడం అంటే టీడీపీ రాయించినట్లే కదా!అదేమిటో తెలుసా! వేమిరెడ్డి ఆ మద్య ఎప్పుడో మద్యప్రదేశ్ లోని ఇండోర్ లో సుప్రింకోర్టు జడ్జి ఇంటిలో జరిగిన పెళ్లికి వెళ్లారట.అక్కడకు ఉత్త చేతులతో కాకుండా, రెండు కోట్ల విలువైన వజ్రాల వాచ్ తీసుకు వెళ్లారని రాసేశారు. దానిని ఆ జడ్జిగారు తీసుకోలేదట.కాని ఇదంతా జగన్ తరపునే వెళ్లారని కూడా ఈ పత్రిక దుర్మార్గంగా ప్రచారం చేసింది.
అది నిజం కాదని వేమిరెడ్డి మొత్తుకున్నా ఆ పత్రిక మాత్రం ఒప్పుకోలేదు. దానిని టీడీపీ సోషల్ మీడియా కూడా విస్తారంగా ప్రచారం చేసి ఉంటుంది.సీన్ కట్ చేస్తే వేమిరెడ్డి తదుపరి వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వేమిరెడ్డి దంపతులు ఇద్దరికి చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చేశారు. వేమిరెడ్డి నెల్లూరు లోక్ సభకు, ఆయన భార్య ప్రశాంతి కోవూరు నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని వజ్రాల వాచ్ లు చంద్రబాబుకు ఇచ్చి ఉండాలని ఎవరైనా అంటే దానికి సమాధానం ఉంటుందా?లేదా టిడిపికి ఏజెంట్ గా పనిచేసే ఆంధ్రజ్యోతి యజమానికి ఏమి ముట్టి ఉంటుంది? అంటే మనం ఏమి చెబుతాం. ఇప్పుడు వేమిరెడ్డి చాలా నీతిమంతుడు , నిజాయితీపరుడు అయిపోయాడు. వేమిరెడ్డిపై ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు ఆగిపోయాయి.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే చంద్రబాబు ప్రతిదానిలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారు. ఆయనకు ఈనాడు, జ్యోతి భజన చేస్తుంటాయనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరమా?అంతేకాదు.బాపట్ల లోక్ సభ నియోజకవర్గానికి టీడీపీ టిక్కెట్ పొందిన మాజీ ఐపిఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం వ్యక్తే కాదు. పైగా తెలంగాణలో బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.ఆయన ఏమి ఇచ్చారో తెలియదు కాని టీడీపీ అభ్యర్ధి అయిపోయారు.ఇదే పని వైఎస్సార్‌సీపీ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ఎన్ని విమర్శలు చేసేవారో ఆలోచించండి. ఏలూరు లోక్ సభ స్థానానికి కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. అభ్యర్ధులను నియోజకవర్గాలు మార్చితే బదిలీలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీపై ప్రచారం చేసిన చంద్రబాబు ఎక్కడ నుంచి ఎక్కడకు తన అభ్యర్దిని తెచ్చిపెట్టారో గమనించండి.మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. ఈయన సీనియర్ నేత ,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడవుతారు. యనమల మరో కూతురు దివ్య కు తుని అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. చంద్రబాబు కుటుంబానికే కాకుండా యనమల వంటి కొద్ది మంది ప్యామిలీ ప్యాకేజీ లభించిందన్నమాట. దీనిపైనే బిజెపి నేతలు పరిపూర్ణానంద స్వామి,ఐవైఆర్ కృష్ణారావు వంటివారు మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పే బిజెపి కుటుంబ రాజకీయం చేసే పార్టీకి మద్దతు ఇస్తోందని వాపోయారు.
బీజేపీ సీట్లలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే పోటీచేస్తున్నారని పరిపూర్ణానంద ద్వజమెత్తారు. చంద్రబాబు కుటుంబం నుంచి అరడజను మంది ఎలా పోటీచేస్తారని మండిపడ్డారు. నీతులు చెప్పేటందుకే కాని తమకు వర్తింప చేసుకోవడానికి కాదన్నది చంద్రబాబు ఫిలాసపీ. ఒరిజినల్ టీడీపీ నేతలు ఇప్పుడు నెత్తి,నోరు కొట్టుకున్నా ఉపయోగం ఏమి ఉంటుంది?మరికొన్నిటిని కూడా చూద్దాం. విశాఖ నార్త్ కు ప్రాతినిద్యం వహించిన గంటా శ్రీనివాసరావును మొదట చీపురుపల్లికి చంద్రబాబు బదిలీ చేశారు. ఆయన ససేమిరా అనడంతో చంద్రబాబే దిగివచ్చి ,గంటా ను భీమిలి బదిలీకి ఒప్పుకున్నారు.ఎచ్చెర్ల సీటును బీజేపీకి ఇవ్వడంతో అక్కడ నుంచి కళా వెంకటరావును చీపురుపల్లికి బదిలీ చేశారు. దీనిపై ఆయన తమ్ముడి కుమారుడు ,విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున వర్గం వారు భగ్గుమన్నారు. అనంతపురంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ప్రభాకర చౌదరిని కాదని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే మరో వ్యక్తికి టిక్కెట్ టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో చౌదరి వర్గం అంతా పార్టీ కార్యాలయంలో విద్వంసానికి పాల్పడింది.
ఇంకా చాలా గొడవలు టీడీపీలో జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ టిక్కెట్లపై పిచ్చి విమర్శలు చేస్తుంటారు.తాజాగా ఆయన ఒక పేదవాడికి వైఎస్సార్‌సీపీ టిక్కెట్ ఇస్తే దానిని కూడా తప్పు పట్టారు. టిప్పర్ డ్రైవర్ కు శింగనమల టిక్కెట్ ఇచ్చారంటూ వైఎస్సార్‌సీపీని ఎద్దేవా చేశారు. దానికి జగన్ ధీటుగా సమాదానం ఇస్తూ, తాము పేదలకు టిక్కెట్లు ఇచ్చామని, చంద్రబాబు పెత్తందార్లకు, డబ్బు ఉన్నవారికే టిక్కెట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. మడక శిర లో కూడా జగన్ ఒక సామాన్య కార్యకర్తకు టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఉపాది హామీ కూలిగా కూడా ఉన్నారు.ఈ విషయాలను జగన్ చెప్పడంతో చంద్రబాబు నాలుక కరుచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.1978 లో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఐ లో చంద్రబాబుకు ఆర్ధికంగా సస్థోమత లేకపోయినా టిక్కెట్ లభించింది.తిరువూరు లో లారీ డ్రైవర్ కు కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ టిక్కెట్ వచ్చింది. వారికే కాదు పలువురు సామాన్యులు టిక్కెట్లు పొందితే పేదలంతా ఓన్ చేసుకుని గెలిపించుకున్నారు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పుంగనూరు నుంచి ఒక ఆర్టీసీ బస్ కండక్టర్ కు టిక్కెట్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఒక సామాన్య కార్యకర్త అయిన తన అబిమానికి ఎన్టీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు జగగన్ కూడా కొంతమంది సాధారణ కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి పేదల నాయకుడిగా ప్రజలలో నిలబడ్డారు. కాని చంద్రబాబు మాత్రం తాను ఆరంభం అయింది పేదరికంలోనే అయినా, ఇప్పుడు దానిని మర్చిపోయారు. తాను స్థితి మంతుడు అవడమే కాకుండా పేదలకు టిక్కెట్లు ఇస్తే ఎద్దేవ చేసే దశకు వెళ్లారు. అందుకే ప్రస్తుతం ఏపీలో పేదలకు ,పెత్తందార్లకు మధ్య పోటీ జరుగుతోందన్న అభిప్రాయం ఏర్పడింది. పేదలు గెలుస్తారా? లేక పెత్తందార్లు నెగ్గుతారా? అన్నది జూన్ నాలుగున తేలిపోతుంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment