ఈనాడు మీడియా సంపాదకీయం రూపంలో మరోసారి విషనాగు కన్నా ఘోరంగా ఏపీపై విషాన్ని కక్కింది. వారి మనసులో ఉన్న దుర్భుద్ది పచ్చిగా బయటపడింది. పైకి పోలవరం ప్రాజెక్టుకు ఏదో జరిగిపోతోందన్న ప్రచారం చేస్తూ, లోపల మాత్రం ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై బండెడు బురద చల్లవచ్చన్న వారి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది.
అసత్యాలు, అర్ద సత్యాలతో తమ పైత్యాన్ని నింపేశారు..
తమ బంధువుల కంపెనీని పోలవరం ప్రాజెక్టు నుంచి తప్పించారన్న దుగ్దతో పాటు మార్గదర్శి అక్రమాల కేసు నేపథ్యంలో ఇంత నీచంగా సంపాదకీయాలు రాస్తున్నారు. కొద్దికాలం క్రితం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధంచి కొన్ని మోటార్లు నీట మునిగాయి. దానివల్ల చాలా నష్టం జరిగింది. అప్పుడు రామోజీరావు కలంలో సిరా అయిపోయింది. ఏపీలో ఏ ఘటన జరిగినా, దానిని వక్రీకరించి , ముఖ్యమంత్రి జగన్‌కు ఆపాదించి రాయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దానివల్ల తాము మద్దతు ఇస్తున్న తెలుగుదేశంకు లాభం కలుగుతుందని వారు అనుకుంటున్నారేమో కాని, ఈనాడు డొల్లతనం నగ్నంగా బయటపడుతోందన్న సంగతిని విస్మరిస్తున్నారు. చరిత్ర క్షమించని జగన్ పాపం అంటూ ఒక సంపాదకీయాన్ని చెడ రాసేశారు. అందులో అసత్యాలు, అర్ద సత్యాలతో తమ పైత్యాన్ని జోడించి మరీ నింపేశారు. అనేక కీలకమైన అంశాలను మరుగున పరచి ప్రజలకు అవేవి తెలియవులే అనుకునే తెంపరితనంలో ఎడిటోరియల్ రాసి , జర్నలిజాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లడంలో రామోజీరావు కొత్త రికార్డు సృష్టించారు.
అది జగన్ ఘనత కాదా రామోజీ!
పోలవరం ప్రాజెక్టులో ఏదైనా సమస్య వస్తే వార్తలు ఇవ్వవచ్చు. సంపాదకీయం రాయవచ్చు. తప్పు లేదు. కాని పూర్తి స్థాయి విశ్లేషణ కాకుండా, తమకు నచ్చిన నేత ఎంత అరాచకంగా చేసినా,సమర్దించడం, తమకు గిట్టని నేత ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ఏమీ జరిగినా మొత్తం ఆయనకే అంటగట్టి దుష్ప్రచారం చేయడం ఎంత దారుణం. ఈనాడు విస్మరించిన కొన్ని వాస్తవాలను ముందుగా గుర్తు చేసుకుందాం. ఇటీవలే పోలవరం ప్రాజెక్టుకోసం జగన్ విజ్ఞప్తి మేరకు 13 వేల కోట్ల రూపాయల నిదులు ఏక మొత్తంగా ఇవ్వడానికి కేంద్ర ఆర్దికశాఖ పచ్చజెండా ఊపింది. అది జగన్ ఘనత కాదా? కనీసం ఒక అక్షరం అన్నా దాని గురించి రాశారా?గతంలో రాష్ట్రం ఖర్చు చేస్తున్న మొత్తాలను కేంద్రం నుంచి తిరిగి రాబట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడవలసి వచ్చేది!జగన్ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ ను మార్చారని, ప్రస్తుత కాంట్రాక్టు సంస్థపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు.
మరి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా అదే సంస్థ నిర్మించింది కదా!దానిపై ఎందుకు ఒక్క ముక్క రాయలేకపోయారు? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అంత రామోజీకి అంత భయమా? అసలు ఇది కేంద్రం నిర్మించి ఇవ్వవలసిన ప్రాజెక్టు అయితే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు తనకే ఇవ్వాలని కేంద్రం నుంచి పట్టుబట్టి తెచ్చుకున్నారు. ఆ వెంటనే రామోజీ బంధువుకు ఎందుకు కాంట్రాక్టు అప్పగించారు?అప్పుడు అంతా సమ్మగా ఉందా! అసలు 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి శ్రద్ద చూపకుండా, పట్టిసీమ లిఫ్ట్ పేరుతో కధ నడిపారు. అప్పుడు కూడా ప్రస్తుత పోలవరం కాంట్రాక్టరే దానిని నిర్మించారు కదా! ఆయన సకాలంలో పూర్తి చేశారు కనుక 'సుమారు 150 కోట్ల అదనపు ప్రయోజనం సమకూర్చారు కదా!అప్పుడు రామోజీకి చాలా బాగుందా? ప్రత్యేక హోదాను వదలుకుని ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు ఒప్పుకున్నప్పుడు రామోజీకి ఆయనలో గొప్ప మనిషి కనిపించారనుకోవాలి.
అప్పుడు నీ బంధువుకు కాంట్రాక్ట్ ఇస్తే అంతా హ్యాపీస్..
ఎందుకంటే దానిని అడ్డం పెట్టుకుని పోలవరం కాంట్రాక్టు తీసుకుని తన బంధువుకు కాంట్రాక్టు ఇచ్చారు కనుక అంతా హాపీస్ అని అనుకున్నారా! అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాని, ఆనాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాని 2018లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని బీరాలు పలికినప్పుడు అవి సుస్వరాలుగా రామోజీకి వినిపించాయా? 2019 కి కూడా ఎందుకు పూర్తి కాలేదని రామోజీ టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? జగన్ ప్రభుత్వం వచ్చాక సుమారు 800 కోట్లు ఆదాచేసిన మాట అబద్దమా? తదుపరి ప్రాజెక్టు స్పిల్ వే పనులతో సహా అనేక విభాగాలను పూర్తి చేసింది అవాస్తవమా? పునరావాస పనులలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది కనిపించదా! చంద్రబాబు టైమ్ లో అప్పర్ కాఫర్ డామ్ నిర్మాణంలో కొన్ని గాప్ లు ఎందుకు ఉంచారని రామోజీ అడగడం లేదు?ఆ గ్యాప్ లను జగన్ ప్రభుత్వం పూడ్చలేకపోయిందని ఆయన అంటున్నారు.
గత ప్రభుత్వం కాఫర్ డామ్ లో గాప్ లు ఉంచడంతో వరదలువచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం ప్రజలకు తెలియదా! పోనీ ఒకవేళ రెండుప్రభుత్వాల తప్పు ఉందని అనుకుంటే దాని గురించి రాయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా మొత్తం నెపాన్ని జగన్ పై వేయడంలోనే రామోజీ దురుద్దేశం కనిపిస్తుంది. తదుపరి జగన్ ప్రభుత్వ టైమ్ లో రెండేళ్ల పాటు కరోనా వచ్చిన సంగతి రామోజీకి తెలియదా! తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా!పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకోవడం వేరు. అది అసలు పూర్తి కాదన్నట్లు చిత్రీకరించడం వేరు. నిజంగా ఆ పరిస్థితి ఉంటే రాయవచ్చు. లేదూ ప్రాజెక్టు ఆలస్యం అయితే గత ప్రభుత్వ టైమ్ లో జరిగిన తప్పులు, ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైనా ఉంటే రాయవచ్చు.
పదే పదే చెత్త రాతలు
అలాకాకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏదో సాధించేసినట్లు, ఈ ప్రభుత్వం ఏమీ చేయనట్లు దుర్మార్గంగా రాయడమే అభ్యంతరకరం. అంతేకాక ముఖ్యమంత్రిని పట్టుకుని చేతిలో కలం, టీవీ ఉందని కదా ఇష్టారీతిన ప్రచారం చేయడం ద్వారా దుష్టచతుష్టయంలో భాగంగానే ఉన్నానని పదే,పదే రామోజీ రుజువు చేసుకుంటున్నారు. ఆయన చెత్త సంపాదకీయంలోని కొన్ని వ్యాఖ్యలను చూద్దాం. ' పోలవరం ప్రజెక్టును జగన్ బలి తీసుకున్నారట. జగన్ ప్రభుత్వ చాతకానితనానికి నిదర్శనంగా గైడ్ వాల్ కుంగిపోయిందట.వైకాపా నిర్వాకాలవల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందట.2025 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి కి అధికారవర్గాలు తలపోస్తున్నట్లు కధనాలు వస్తున్నాయట.గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వైకాపా వర్గాలు ఊరు,వాడ టముకేసుకుంటాయట.ప్రాజెక్టును అనిశ్చితిలోకి జగన్ నెట్టారట. ప్రజానీకం ఉసురుపోసుకుంటున్నారట.
ఈ పాపాన్ని చరిత్ర క్షమించదట ." ఇలా తమ అజ్ఞానమో లేక అహంకారమో బయటపెట్టుకోవడానికి రామోజీ ఈనాడు మీడియా సిగ్గుపడలేదు. గైడ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసికి, పోలవరం అధారిటీ పర్యవేక్షణలోనే కదా జరిగింది. ఇప్పుడు దాని మరమ్మతు కూడా వారి ఆద్వర్యంలోనే జరుగుతుంది కదా! దానివల్ల ప్రాజెక్టుకు సమస్య లేదని చెబుతున్నా, అడ్డదిడ్డంగా ఏదో ఒక చాన్స్ వచ్చిందన్న ఆనందంతో ఈ సంపాదకీయం ఉన్నట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. ఒకపక్క ప్రాజెక్టు బలి అయిపోయిందని అంటారు.ఇంకో పక్క 2025 నాటికి పూర్తి కావచ్చంటున్నారని వీరే రాస్తారు. అసలు మనసులోని కోరిక ఏమిటంటే ఈ ప్రాజెక్టు జగన్ టైమ్ లో పూర్తి కారాదన్నదే.
ఆయనకు ఏకంగా 13వేల కోట్ల రూపాయలు తెచ్చిన ఖ్యాతి దక్కకూడదన్నదే వారి తాపత్రయం. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వ టైమ్ లో అవినీతే జరగలేదని ఈనాడు సర్టిఫై చేస్తోంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వచ్చి చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎమ్ గా మారిందని ఎందుకు అన్నారో రామోజీ రాయవచ్చు కదా!లేదా మోదీని నిందిస్తూ సంపాదకీయం రాసి ఉండవచ్చు కదా! ఇవేవీ చేయరు. ఎంతసేపు జగన్ పై ఏడుపుతో వార్తాకధనాలు, సంపాదకీయాలు ఇవ్వడంద్వారా ప్రజలను మోసం చేయాలన్నదే వారి ధ్యేయం . అదృష్టవశాత్తు ఈనాడు రాసే ఇలాంటి చెత్త సంపాదకీయాలను ప్రజలు పెద్దగా చదవరు కనుక, పట్టించుకోరు కనుక సరిపోతోంది కాని, లేకుంటే ఏపీకి చాలా నష్టం జరిగి ఉండేది. ఏపీకి ఈనాడుమీడియా పెద్ద శాపంగా మారింది. జర్నలిజానికి ఇంతగా దిగజార్చిన ఈనాడు మీడియాను చరిత్ర క్షమిస్తుందా!
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
చదవండి: తొంగి చూసినట్లే ఈనాడు రాతలు!..మరి వాటికీ సమాధానాలు చెప్పొచ్చుగా?
Comments
Please login to add a commentAdd a comment