ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదునైనా భాషలో మాటకు మాట బదులు చెబుతున్నారు. తన రాజకీయ ప్రత్యర్ధులకు వడ్డీతో సహా జవాబిస్తున్నారు. ఆయన రోజూ ఏదో ఒకటి మాట్లాడడం లేదు. ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నిటిని నోట్ చేసుకుని, అన్నిటికి ఒక్కసారే జవాబు ఇస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలుకు వెళ్లిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన జైలులో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటేనని ఒక్క మాటలో కొట్టిపారేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వారాహి యాత్రలో చేసిన వ్యక్తిగత ఆరోపణలకు మరింత ఘాటుగా ఆయన బదులు ఇచ్చారు.
✍️సామర్లకోటలో జరిగిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన ప్రసంగంలో ఎప్పటి మాదిరే ముందుగా తన ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ది కార్యక్రమాలను వివరించి, పేదల కోసం తాను చేస్తున్న కృషిని కోర్టుల ద్వారా టీడీపీ, జనసేన వంటి పార్టీలు అడ్డుపడుతున్న వైనం గురించి తెలియచేసిన తర్వాత రాజకీయ అంశాల మీదకు మళ్లారు. చంద్రబాబుకు ఈ సందర్భంగా మరో చురక అంటించారు. చంద్రబాబు ఎన్నడైనా నెల రోజులపాటు ఏపీలో ఉన్నారా?అని ప్రశ్నిస్తూ ఒక్క రాజమహేంద్రవరంలో తప్ప అని అన్నారు.అంటే రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు ఉన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించి ఈ విమర్శ చేశారు. ఇక చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ. వేమూరి రాధాకృష్ణ, టివి 5 బిఆర్ నాయుడు .. వీరంతా ఏపీకి సంబంధం లేని వారని, కేవలం దోచుకోవడానికే ఏపీపై పడుతుంటారని ఆరోపించారు.
✍️చంద్రబాబు స్థిర నివాసం హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఉంది. ఆయనకు ఏపీలో ప్రత్యేకించి రాజదాని అమరావతి లో ఇల్లు కట్టుకోలేదు. అది ప్రభుత్వ ఇల్లో, ప్రైవేటు ఇల్లో తెలియని కరకట్ట అక్రమ నివాసంలో అక్కడకు వచ్చినప్పుడు ఉంటుంటారు. ఆయన కుటుంబం మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది. దాంతో ఆయన ఏపీకి పరాయి వ్యక్తి అని జగన్ ప్రజలకు తెలియచెప్పే యత్నం చేశారు. జగన్ తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటినుంచే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అందులోనే కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ యాత్రలు ఉంటే తప్ప ఏపీలో ఉండరు. షూటింగ్ షూటింగ్‌కు మద్య మాత్రమే ఏపీకి వస్తుంటారు. తద్వారా ఆయనను ఏపీకి సంబంధం లేని నేతగానే ప్రొజెక్టు చేశారు. ఇక నటుడు , హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , రామోజీ, రాధాకృష్ణ, నాయుడు వంటివారు హైదరాబాద్ వాసులే. ఎన్నడూ ఏపీకి రారు. కాని నిత్యం ఏపీ ప్రభుత్వంపైన, ప్రజలపైన విషం చిమ్ముతుంటారు.
✍️చంద్రబాబు అధికారంలో ఉంటే తమ దోపిడీకి అడ్డు ఉండదనే వారు ఇలా చేస్తున్నారని జగన్ ఆరోపిస్తుంటారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వివాహాల గురించి, మహిళలు, వివాహ వ్యవస్థపై ఆయనకు గౌరవం లేదని చెప్పడానికి కూడా ఈ అవకాశాన్ని జగన్ వినియోగించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఈ ప్రస్తావనలు తేవడం లేదు.కాని తన యాత్రలలో జగన్ పై పవన్ లేని పోని వ్యక్తిగత ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తుండడంతో వాటికి సమాధానంగా ఈసారి మాట్లాడినట్లు అనిపించింది. పవన్ చెప్పే వాటిని, జగన్ చెబుతున్నవాటిని పోల్చి చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. పవన్ కళ్యాణ్ అత్యధిక శాతం జగన్ పై వ్యక్తిగత ద్వేషంతో , అక్కసుతో విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అబద్దాలు చెబుతున్నారు. ఉదాహరణకు జగన్ కు లక్ష కోట్ల ఆస్తి ఉందని అచ్చం చంద్రబాబు నాయుడు మాదిరి విమర్శ చేశారు. అది నిజం కాదని తెలిసి కూడా పవన్ అలా మాట్లాడారు. ఏపీలో 30 వేల మంది మహిళలు గల్లంతు అయ్యారని తప్పుడు ఆరోపణ చేశారు. అంతకన్నా బాధ్యతారహితంగా 67 వేల మంది పిల్లలు మరణించారని నీచమైన వ్యాఖ్య చేశారు. వీటికి ఎక్కడా ఆధారాలు చూపలేదు. పెడనలో తన సభలో గొడవలు చేయడానికి రెండువేల మంది గూండాలను వైసిపి దించుతోందని మరో పిచ్చి ఆరోపణ చేశారు.
✍️దానికి మంత్రి జోగి రమేష్ తానే దగ్గరుండి పవన్ సభ పూర్తి అయ్యేలా చేస్తానని సవాల్ చేశారు. పవన్ సభలు ఎక్కడా ఏ గొడవ లేకుండానే జరిగిపోయాయి. దాని అర్ధం ఏమిటి? పవన్ కళ్యాణ్ అసత్యాలు చెప్పారనే కదా!ఇక జగన్ చేసిన విమర్శలు చూద్దాం. ఆయన పవన్ ను ఉద్దేశించి చంద్రబాబు దత్తపుత్రుడు అన్న పదం వాడుతుంటారు. నిజంగా దత్తపుత్రుడు కాకపోయినా, ఆ తరహాలో పవన్ వ్యవహరిస్తున్నారని జగన్ చెబుతుంటారు. దానికి తగ్గట్లుగానే అవినీతి కేసులలో కూడా చంద్రబాబు కుమారుడు లోకేష్‌తో పాటు, పవన్ కళ్యాణ్ అచ్చం దత్తపుత్రుడి మాదిరే రోడ్డు మీద దొర్లి మరీ హడావుడి చేశారన్న అభిప్రాయం ఏర్పడుతుంది.పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా ఆయన పెళ్లిళ్ల గురించి జగన్ ప్రస్తావించారు. ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్ అని చెప్పారు. పవన్ తొలుత కాపు సామాజికవర్గానికి చెందిన ఏపీ యువతిని పెళ్లాడి , తదుపరి విడాకులు ఇచ్చేశారు.అందుకు లోకల్ అని అన్నారు. తదుపరి పూణెకి చెందిన యువతిని పెళ్లాడి ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు.అంటే నేషనల్ అన్నమాట. తర్వాత రష్యాకు చెందిన యువతిని పెళ్లాడారు. అంతర్జాయం అన్నమాట.
✍️ఆ పిమ్మట ఎవరో అని వ్యంగ్యాస్త్రం సందించారు. ఇదే టైమ్ లో జగన్ మరో అంశాన్ని చెప్పకుండా వదలివేశారు. గతంలో పవన్ రెండో భార్య చేసిన విమర్శల గురించి. ఒకరితో వివాహ బంధం ఉన్నప్పుడే వేరొకరితో కూడా కాపురం చేశారని ఆమె ఆయా ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చారు. ఆ ప్రస్తావన మాత్రం జగన్ చేయలేదు. ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కినప్పుడు అలాంటివి కూడా ముందుకు వస్తాయేమో తెలియదు. పవన్ కళ్యాణ్ విధానపరమైన అంశాల జోలికి వెళ్లకుండా ఎంతసేపు జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం, ఆయనను కించపరిచేలా మాట్లాడడం చేస్తుండడంతో అదే తరహాలో జగన్ ఘాటుగా స్పందించారనుకోవచ్చు.
✍️దీనిపై మాజీ స్పీకర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ అభ్యంతరం చెప్పి, వీరమహిళలంతా జగన్‌పై ఆందోళనకు దిగుతారని అన్నారు. కాని ఏ ఒక్కరు అందుకు సిద్దపడినట్లు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ తీరును జగన్ విమర్శిస్తే, అందులో మహిళలను అవమానించడం ఏముందన్న ప్రశ్న వచ్చింది. ఇంకో మాట చెప్పాలి. ప్రముఖ నటి, మంత్రి రోజాపై టీడీపీ మాజీ మంత్రి నీచమైన విమర్శ చేస్తే సాటి నటుడు అయి ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం కూడా బాగోలేదు.దానిని మహిళలను అవమానించడం అంటే.తలుపుచెక్కతో కొడితే తమలపాకుతో జవాబిస్తారా అన్నది ఒక నానుడి. టిట్ ఫర్ టాట్ అంటారు. పవన్ కళ్యాణ్ అర్ధం లేని ప్రసంగాలకు జగన్ ఘాటైన రీతిలో జవాబు ఇవ్వకుండా ఎలా ఉంటారు?
Comments
Please login to add a commentAdd a comment