
రాజకీయాల్లో మనగలగాలంటే.. ధైర్యంతోపాటు పోరాటపటిమ, వేధింపులను సైతం భరించాల్సిన ఓరిమి అవసరం. ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు? అంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులని చెప్పాలి. ఏదో ఒకలా గద్దెనెక్కిన టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి నేతలు.. ఒకపక్క ప్రభుత్వం వైపు నుంచి, ఇంకోవైపు పోలీసుల ద్వారా వైఎస్సార్‌సీపీ నేతలు, మద్దతుదారులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. తద్వారా పార్టీని వీలైనంత మేర బలహీనం చేయాలన్నది వారి ఉద్దేశంలా కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు తమ ‘రెడ్ బుక్’ ద్వారా ఈ కుట్రకు తెరలేపారు. చంద్రబాబు కంటే.. లోకేశే ఈ విషయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, కొంతమంది విశ్రాంత పోలీసు ఉన్నతాధికారుల సలహా సూచనల మేరకు దాడులు, వేధింపులు, తప్పుడు కేసులు, సస్పెన్షన్ల వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చాలామంది అంచనా. ఈ పరిణామాలతో బాగా ఇబ్బంది పడ్డ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలేలు, రాజ్యసభ ఎంపీలు, జెడ్ పీ ఛైర్‌పర్సన్లు, మేయర్లు, కార్పొరేటర్లే చేతులెత్తేసి పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వీర విధేయులుగా ఉన్నవారు, టీడీపీ అంటే అసలు గిట్టనివారు కూడా వెళుతూండట వేధింపులను బలపరిచేవిగా కనిపిస్తున్నాయి.
విశేషమేమిటంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఏదీ లేకపోయినా వీరిలో కొందరు జనసేనలో చేరడం. దీనిపై కూటమిలో కొన్ని అసంతృప్తులున్నా ప్రస్తుతానికి బయట పడకుండా ఉంటున్నారు.. కొన్ని చోట్ల తప్ప. రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇదంతా చంద్రబాబు కొనుగోళ్ల రాజకీయమేనని వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైఎస్సార్ సీపీని వీడి జనసేనలో చేరారు.
ముందుగా ఎంపీల విషయాన్ని పరిశీలిస్తే మోపిదేవి వెంకటరమణ మొదట కాంగ్రెస్ లోను, ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్ వెంట నడిచారు. జగన్ ను కేసుల్లో ఇరికించడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి ఆడిన కుట్రలో మోపిదేవి కూడా బలయ్యారు. జైలులో ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన జగన్ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా గౌరవం పొందారు. 2019లో ఆయన ఓటమి పాలైనా జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రి పదవి ఇచ్చారు.
ఆ తర్వాత కౌన్సిల్ రద్దవుతుందన్న భావనతో ఆయన్ను రాజ్యసభకు పంపారు. వైఎస్సార్‌సీపీలో అంత గౌరవ మర్యాదలు పొందిన మోపిదేవి టీడీపీలో చేరతారని ఎవ్వరూ ఊహించరు. జగన్ కేసుల్లో ఉన్న మోపిదేవితో సహా అందర్ని తీవ్రంగా విమర్శిస్తుండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన్ను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం జగన్ రేపల్లె పార్టీ సమావేశంలో మోపిదేవి అంశం ప్రస్తావనకు తెస్తూ, ఆయనకు ఎంత గౌరవం ఇచ్చింది వివరించారు. మోపిదేవిని ఒక్క మాట అనకుండా, రాజకీయ విమర్శ చేయకుండా జగన్ తన సంస్కారాన్ని ప్రదర్శించారు.
బీద మస్తాన్ రావు తెలుగుదేశం నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. అనతికాలంలోనే ఎంపీ అయ్యారు. వ్యాపారవేత్త అయిన ఈయన విశ్వాసంతో సంబంధం లేకుండా తిరిగి టీడీపీలోకి వెళుతున్నారు. బీసీ నేతగా పేరొందిన తెలంగాణ నేత ఆర్. కృష్ణయ్యను జగన్ అనూహ్య రీతిలో రాజ్యసభ సభ్యుడిని చేస్తే ఇప్పుడు అధికారం పోగానే ఆయన జారుకున్నారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది మరొక కథ. వైఎస్సార్ సీపీలో ఉండగా ప్రకాశం జిల్లాలో ఆయన చక్రం తిప్పారు. అప్పుడప్పుడు అలిగినా పార్టీ అధిష్టానం బుజ్జగిస్తుండేది. ఆయన తెలుగుదేశానికి చెందిన ఒక మీడియా వారితో సన్నిహిత సంబంధాలు నెరపినా పార్టీ నాయకత్వం తప్పు పట్టలేదు. మరో సీనియర్ నేత, బాలినేని సమీప బంధవు వైవీ సుబ్బారెడ్డితో వర్గ గొడవ ఉన్నా పార్టీ నాయకత్వం భరించింది. సుబ్బారెడ్డి ద్వారా జగన్ కు కూడా ఈయన బంధువు అవుతారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఈయన తన పదవులకు రాజీనామా చేసి ఆయన వెంట నడిచారు.
కమిటెడ్ నేతగానే చాలా కాలం ఉన్నారు. దానికి తగ్గ గుర్తింపు కూడా పొందారు. కానీ ఆసక్తికరంగా ఆయన ఇప్పుడు జనసేనలో చేరారు. దానికి కారణం ఒక్కటే. టీడీపీ వారి దాడులు, వేధింపులు, కేసుల భయం. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గమని అనుకొని ఉన్నట్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈయన కుమారుడు, కోడలిని కూడా టీడీపీ వారు ఇబ్బంది పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్ధన్ పలుమార్లు ఈయనతో గొడవ పడ్డారు. బాలినేని జనసేనలో చేరడాన్ని కూడా ఆయన ఒప్పుకోలేదు. బాలినేనిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఆయన సంగతి చూస్తామని దామచర్ల హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ తాకిడిని తట్టుకోవడానికి గతంలో తనకు పవన్ కల్యాణ్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలను ఉపయోగించుకొని జనసేనలో చేరారని అనుకోవాలి.
జగ్గయ్యపేటకు చెందిన సామినేని ఉదయభాను కడా జగన్ ను ఫాలో అయి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన వారే. ఇన్నేళ్లు పోరాటాలు చేసినవారే. కారణం ఏమైనా టీడీపీ వేధింపులు తట్టుకోవాలంటే జనసేనలో చేరడమే బెటర్ అనుకొని ఆ పార్టీలో చేరారు. మరో నాయకుడు కిలారి రోశయ్యకు వ్యాపారవేత్త. సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడవుతారు. 2019లో పొన్నూరు టికెట్ మీద ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్సార్ సీపీ తరపున అనేక డిబేట్లలో పాల్గొనేవారు. గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. గుంటూరు జిల్లాలో స్థానిక రాజకీయాలు, దాడులు, వేధింపులను దృష్టిలో పెట్టుకొని జనసేన అయితే టీడీపీ వారుగానీ, పోలీసులు గానీ తమపైకి రారనే అభిప్రాయంతో పార్టీ మారినట్టుగా కనపడుతోంది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. అదే కూటమి పార్టీల్లో చేరితే ఆ తలనొప్పి ఉండదు. నేరగా టీడీపీలో చేరలేని వారు కొంతమంది ఈ రకంగా జనసేనను ఆశ్రయిస్తున్నారని అనుకోవచ్చు. టీడీపీలోకి వెళ్లిన హిందుపూర్ కౌన్సిలర్లు తిరిగి వైసీపీలోకి రావడం కూడా గమనించదగ్గ పరిణామమే. బాలినేని, సామినేని, కిలారి ఈ ముగ్గురిలో ఎవరికీ వచ్చే ఎన్నికల్లో జనసేన టికెట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సంగతి తెలిసినా వీరు జనసేనలో చేరడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కు ఇలాంటి పరిణామాలు కొత్త కావు. నిజానికి ఆయన ఒంటరిగానే తన పోరాటాన్ని ఆరంభించారు. అప్పట్లో ఆయనపట్ల జనంలో ఉన్న ఆదరణను గమనించి గానీ, వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో గానీ సుమారు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతోపాటు నడిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా జగన్ ఎక్కడా నిరుత్సాహపడలేదు. చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా నిర్భయంగా జనంలోకి వెళ్లి తన ఎజెండాను తెలియజేసి 2019లో అధికారంలోకి వచ్చారు. టీడీపీని బలహీన పరచడానికి, ఆ పార్టీ నేతలను వేధించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించ లేదు.
వివిధ హామీలను, స్కీములను అమలు చేసి ప్రజాదరణ చూరగొన్నారు. అయినా ఈవీఎంల మాయాజాలంతో కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో కూటమి అలవికాని హామీలిచ్చి జనాల్ని మోసం చేసింది. ప్రస్తుతం వంద రోజులకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఆ పరిస్థితిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు మత రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. అయినా జగన్ వీటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కూడా తనను వీడేవారిని ఒక్కరిని కూడా ఒక్క మాట అనకుండా తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. అదే ఆయనలోని విశేష లక్షణం. అందువల్ల ఇప్పుడు పార్టీనుంచి కొంతమంది వైదొలగినా వైఎస్సార్ సీపీకి నష్టం పెద్దగా ఉండదు. ఎందుకంటే జగన్ జనాన్ని నమ్ముకోవడమే కారణం.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment